Maoist Latest News: మావోయిస్టు పార్టీలో పోలీసులకు అత్యంత మోస్ట్ వాంటెడ్ నాయకుడిగా, పోలీసు బలగాలకు సింహస్వప్నంగా మారిన మాడ్వి హిడ్మా అలియాస్ సంతోష్, హిద్మన్న, దేవా గురించి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. అటవీ ప్రాంతాలను ఆసరాగా చేసుకుని భద్రతా బలగాలపై మెరుపు దాడులకు పాల్పడే ఈ గెరిల్లా నాయకుడిని కేంద్ర కమిటీ నుంచి తొలగించారన్న వార్తలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి. ఓ వైపు మావోయిస్టు పార్టీ సుప్రీం లీడర్ నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు ఎన్‌కౌంటర్ కావడంతో హిడ్మా ఎక్కడ ఉన్నాడన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌కు హిడ్మా స్పందన ఎలా ఉండనుంది? ప్రస్తుత నిర్బంధ పరిస్థితుల్లో హిడ్మా వెనక్కి తగ్గుతాడా లేదా భద్రతా బలగాలను నివ్వెరపరిచే దాడులకు సిద్ధపడతాడా అన్న ఉత్కంఠ నెలకొంది.

హిడ్మా చరిత్ర

హిడ్మా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని పువ్వర్తి గ్రామంలో 1980లో జన్మించాడు. ఇతని పూర్తి పేరు మాడ్వి హిడ్మా. తన బాల్య వయసులోనే మావోయిస్టు భావజాలానికి ఆకర్షితులయ్యాడు. సరిగ్గా తన 16వ ఏట అంటే 1996లో మావోయిస్టు పార్టీలో గ్రామ కమిటీలో సభ్యుడిగా చేరి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు లీడర్‌గా ఎదిగాడు.

మావోయిస్టు పార్టీలో హిడ్మా ఎదుగుదల

మావోయిస్టు పార్టీలో హిడ్మా అసాధారణ రీతిలో పనిచేశాడు. చిన్నతనం నుంచి అటవీ ప్రాంతంలోనే పెరగడంతో గెరిల్లా యుద్ధ నైపుణ్యాలు అపారంగా పెరిగాయి. ఊహించని నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి. గ్రామ కమిటీ సభ్యుడిగా పని చేసిన హిడ్మా తన నాయకత్వ లక్షణాలతో పార్టీని ఆకర్షించడంతో ఆయన్ను దళానికి కమాండర్ గా పార్టీ నియమించింది. అతని లీడర్‌షిప్ స్కిల్స్ చూసిన పార్టీ అతన్ని, డివిజనల్ కమిటీ సభ్యుడ్ని చేసింది. ఆ తర్వాత దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా చాలా కాలం పనిచేశాడు. ఒక మాటలో చెప్పాలంటే మావోయిస్టు పార్టీకి గుండెకాయ లాంటి జోన్ దండకారణ్య స్పెషల్ జోన్. పార్టీ కార్యకలాపాలకు కీలకమైన ప్రాంతంగా మావోయిస్టులు చెబుతారు. అంచెలంచెలగా ఎదుగుతూ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) బెటాలియన్ 1 కమాండర్ గా పార్టీ అతన్ని ప్రమోట్ చేసింది.

మావోయిస్టు పార్టీలో ఇది అత్యంత కీలకమైన పదవుల‌్లో ఒకటి. అత్యంత కఠినమైన శిక్షణ పూర్తిచేసిన అతి ప్రమాదకర యూనిట్ పీఎల్జీఏ బెటాలియన్ 1 యూనిట్ ‌గా మాజీ మావోయిస్టులు చెబుతారు. ఈ  బెటాలియన్ కు కమాండర్ గా హిడ్మా ఎన్నో దాడులకు నాయకత్వం వహించి మావోయిస్టు పార్టీ విశ్వాసం చూరగొన్న లీడర్ గా నిలిచాడు. ఆ తర్వాత హిడ్మా తన పోరాట పటిమతో పార్టీని ఆకట్టుకోవడంతో ఆయన్న కేంద్ర కమిటీలోకి సభ్యుడిగా మావోయిస్టు పార్టీ తీసుకుంది. ఆ కమిటీలో అతి పిన్న వయస్కుడుగా హిడ్మా గుర్తింపు పొందారు.

హిడ్మా ప్రధాన దాడులు

గెరిల్లా యుద్ధ తంత్రంలో హిడ్మా నైపుణ్యం అపారం. ఆయన వ్యూహాలు పసిగట్టలేనివి. భద్రతా బలగాలకు తన వ్యూహరచనతో చేసిన గెరిల్లా దాడులు వెన్నులో వణుకు పుట్టించినవే.

  • 2010 దంతెవాడ దాడి: ఈ దాడిలో 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టుల చరిత్రలో ఇది అత్యంత పెద్ద దాడులలో ఒకటి.
  • 2013 దర్భా ఘాట్ దాడి: ఈ దాడిలో ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నాయకులు సహా 25 మంది మరణించారు. ఇందులో సల్వాజుడుం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి మహేంద్ర కర్మతోపాటు, మాజీ కేంద్ర మంత్రి విసీ శుక్లా కూడా ఈ దాడిలో మరణించారు.
  • 2017 సుక్మా దాడి: ఈ దాడిలో 25 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తర్వాతే హిడ్మా కేంద్ర కమిటీకి పదోన్నతి పొందాడు.
  • 2021 బీజాపూర్ దాడి: ఈ దాడిలో 22 మంది భద్రతా బలగాల జవాన్లు అమరులయ్యారు. ఈ దాడికి హిడ్మానే కీలక సూత్రధారి అని చెబుతారు.

హిడ్మా కేవలం మెరుపుదాడులకే పరిమితం కాకుండా, పార్టీ విధానాల్లో మార్పులు తేవడంలోనూ కీలక పాత్ర పోషించాడని చెబుతారు. మావోయిస్టులను ల్యాండ్ మైన్‌ల నుంచి తుపాకీ యుద్ధం వైపు మళ్లించడంలో అతడు ప్రభావం చూపాడు.

కేంద్ర కమిటీ నుంచి తొలగింపుకు కారణం?

ఇటీవలి కాలంలో మావోయిస్టు దళానికి వరుసగా ఎదురైన ఎదురుదెబ్బలు, ముఖ్యంగా ఎన్‌కౌంటర్లలో కీలక నాయకులను కోల్పోవడం హిడ్మా పదవిని ప్రమాదంలో పడేసింది. హిడ్మాను కేంద్ర కమిటీ నుంచి తొలగించడానికి ప్రధానంగా 2 కారణాలు చెబుతారు:

  • వ్యూహరచన వైఫల్యం: భద్రతా బలగాల ఆపరేషన్లను ఎదుర్కోవడంలో హిడ్మా సరైన వ్యూహాలను అమలు చేయలేకపోయాడని పార్టీ నాయకత్వం భావించింది. వరుసగా నాయకులను కోల్పోవడం, దాడులలో వైఫల్యాలు అతడి నాయకత్వ లోపాలేనని మావోయిస్టు పార్టీ భావించినట్లు సమాచారం.
  • చలపతి మరణం వెనుక ఆరోపణలు:ఇటీవలి ఎన్ కౌంటర్లో కీలక మావోయిస్టు నాయకుడు చలపతి మరణం హిడ్మా పదవిని కోల్పోవడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా చెబుతారు. చలపతి భద్రతా బలగాల ఉచ్చులో పడటానికి హిడ్మానే కారణమని పార్టీలో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. అతడు చలపతికి సరైన రక్షణ కల్పించలేకపోయాడని, లేదా అతని మరణానికి పరోక్షంగా కారణమయ్యాడని పార్టీ ముఖ్యుల భావన.

ఈ పరిణామాల నేపథ్యంలో, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ హిడ్మాను కేంద్ర కమిటీ సభ్యత్వం నుంచి తొలగించి, అతని స్థానంలో మరొకరిని దండకారణ్యం బాధ్యతలకు నియమించినట్లు సమాచారం.

కేంద్ర కమిటీ నుంచి తొలగించినా కీలక బాధ్యతల్లో హిడ్మా

హిడ్మా కేంద్ర కమిటీ నుంచి తొలగించినప్పటికీ, అతను ఇప్పటికీ PLGA బెటాలియన్ 1కి కమాండర్ గా కొనసాగుతున్నాడు. ఇది మావోయిస్టు దళంలో అత్యంత కీలకమైన స్థానం. ఈ మార్పులు మావోయిస్టుల కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. హిడ్మా తన పదవిని కోల్పోయినా, అతని గెరిల్లా నైపుణ్యాలు, అతని యుద్ద వ్యూహ రచనా స్వభావం భద్రతా బలగాలకు ఇప్పటికీ ఒక పెద్ద సవాలుగా ఉందనడంలో సందేహం లేదు. అయితే  తన గురువు చలపతి మరణం, మరోవైపు  మావోయస్ట్ చీఫ్ నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ కు ప్రతిగా హిడ్మా ఎలాంటి వ్యూహ రచన చేస్తాడన్న చర్చ సాగుతోంది. మరో వైపు మావోయస్టుల కోసం దేశ వ్యాప్తంగా జల్లెడ పడుతున్న భద్రతా బలగాల చేతికి చిక్కుతాడా అన్న  ఉత్కంఠ నెలకొంది.  అయితే ఇప్పటి వరకు హిడ్మా ఆచూకి మాత్రం తెలియని పరిస్థితి ఉంది.