నిజామాబాద్ జిల్లా బీజేపీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరుతోంది. ఎంపీ అరవింద్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎంపీ అరవింద్ వర్గం, యెండల లక్ష్మీనారాయణ వర్గం ఇలా జిల్లా బీజేపీ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. పార్టీ కార్యక్రమాల్లో సైతం అరవింద్ పాల్లొంటే యెండల వర్గం దూరంగా ఉంటారు. యెండల లక్ష్మీనారాయణ కార్యక్రమం చేస్తే అరవింద్ ఆయన వర్గం దూరంగా ఉంటారు. ఈ ఇద్దరు నేతలు ఒకే వేధికపై కనిపించటం అరుదు.
యెండల లక్ష్మినారాయణ వద్దకు వెళ్లిన వారిని అరవింద్ టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయ్. మొదట్నుంచీ యెండల లక్ష్మి నారాయణ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. రెండు సార్లు డీఎస్ ను లక్ష్మినారాయణ ఓడించిన నేతగా పేరుంది. 2019 ఎన్నికలకు ముందు అరవింద్ బీజేపీలో చేరారు. ఈ ఇద్దరు నేతలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే. నిజామాబాద్ జిల్లాలో మున్నూరు కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉంటుంది. అయితే జిల్లాలో బీజేపీ పార్టీకి కొంత పట్టుంది. కానీ నేతల మధ్య ఆధిపత్య పోరుతో క్యాడర్ కన్ఫ్యూజ్‌లో ఉంది. సెకండ్ క్యాడర్ నేతలు ఏ నేత వద్దకు వెళ్తే ఏమవుతుందోనని భయపడుతున్నారంట. యెండల లక్ష్మినారాయణ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటే అరవింద్ వర్గం నేతలెవరూ ఆ కార్యక్రమానికి వెళ్లరు. అరవింద్ పాల్గొనే కార్యక్రమాల్లో యెండల వర్గం దూరంగా ఉంటారు. దీంతో ఎవరికి వారే అన్న రీతిలో అదిపత్య పోరు నడుస్తోంది.
యెండల వర్గానికి చెందిన బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి పటేల్ ప్రసాద్ పై ఓ మహిళను వేధిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయ్. అతనిపైన పోలీస్ కేసు కూడా నమోదైంది. అయితే పార్టీలో ఎలాంటి విచారణ జరపకుండానే పార్టీ నుంచి అతని సభ్యత్వం రద్దు చేశారు. కేసు నమోదైన వెంటనే యాక్షన్ తీసుకోవటంతో ఇది ఎంపీ అరవింద్ వర్గమే చేసుంటారన్న గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయ్. అరవింద్ వర్గానికి చెందిన నాయకులు ఏ తప్పు చేసినా వారిపైన యాక్షన్ ఉండదు అనేది యెండల వర్గం వాదన. బీజేపీ పార్టీకి చెందిన కార్పోరేటర్లు అరవింద్ కనుసన్నల్లోనే ఉంటారనేది యెండల వర్గీయుల వాదన. ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని ఉన్న యెండలకు జిల్లా పార్టీలో ప్రాధాన్యతను అరవింద్ తగ్గిస్తున్నారన్న వాదన యెండల వర్గంలో ఉంది. పార్టీ పదవుల్లో సైతం యెండల వర్గానికి అన్యాయం జరిగిందని చెప్పుకుంటారు. పార్టీలో ఎంపీ అరవింద్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య యెండల లక్ష్మినారాయణతో చేసే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్న కారణంతో ప్రస్తుతం బస్వ లక్ష్మీనర్సయ్యతో ఎంపీ అరవింద్ దూరంగా ఉంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఈ ఇద్దరి మధ్య పోరు తారా స్థాయికి చేరుకుంటోందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
అరవింద్ వర్గం కనీసం ప్లేక్సీల్లో కూడా యెండల ఫోటో ఉండకుండా చూస్తారని ఆ వర్గం వాపోతోంది. మరోవైపు ఆర్మూర్ నియోజకవర్గంలో వినయ్ రెడ్డి ఎన్నికల సమయంలో అరవింద్ బాగా పనిచేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో స్థానికుడైన వినయ్ రెడ్డిని కాదని స్థానికేతరులకు అక్కడ ప్రాధాన్యం ఇవ్వటంతో పార్టీ క్యాడర్ లో రాంగ్ మెసేజ్ వెళ్తోందని కార్యకర్తలు ఆయోమయంలో ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఆర్మూర్ లో బీజేపీ పార్టీని బలోపేతం చేయటంలో వినయ్ రెడ్డి కృషి చేశాడన్న పేరుంది. సీనియర్లు చాలా మంది పార్టీకి అంటిముట్టనట్లు ఉంటున్నరన్న చర్చ జిల్లా కమలం పార్టీలో నడుస్తోంది. జిల్లా పార్టీలో అరవింద్ అంతా తానై నడిపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
Also Read: Corona Updates: పోలీస్ శాఖపై కరోనా పంజా... హైదరాబాద్ పరిధిలోని పలు పీఎస్ లలో భారీగా కేసులు...