Praja Palana Applicants: ప్రజల బలహీనతలను ఆసరగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. గతంలో లాటరీ, లక్కీ డ్రా, గిఫ్ట్‌లు, క్రెడిట్ కార్డుల పేరుతో ప్రజలను దోచుకునేవారు. ఇప్పుడు తాజాగా కొత్త పంధా ఎన్నుకున్నారు. తెలంగాణ ‘ప్రజాపాలన’ దరఖాస్తుదారులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. దరఖాస్తుదారుల బ్యాంక్ ఖాతాలోని డబ్బులు కాజేసేందుకు సైబర్ మోసగాళ్లు కొత్త ప్లాన్ వేశారు.
దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు 90 శాతం మంది మహిళలు ఉండటంతో కాల్ చేసి నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు కోల్పోయిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల ఓ మహిళకు కాల్ చేసి ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.10 వేలు నొక్కేశారు. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రూ.10 వేలు స్వాహా
వివరాలు.. ‘ప్రజాపాలన’లో డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన లావణ్య దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 3న ఆమెకు గుర్తు తెలియని మహిళ ఫోన్ చేశారు. ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తు గురించి మాట్లాడారు. అప్లికేషన్ పరిశీలిస్తున్నామని, రేషన్‌కార్డులో తప్పులు ఉన్నాయని చెప్పారు. వాటిని సరిచేయాలని లేకపోతే పథకాలు రావాంటూ భయపెట్టారు. తప్పులను సరిదిద్దాలంటే ఫోన్‌కు వచ్పచే ఓటీపీ చెప్పాలని సూచించింది. వారు చెప్పిన విషయాలు నిజమేనని నమ్మిన లావణ్య ఓటీపీ చెప్పింది. వెంటనే ఆమె ఎస్‌బీఐ ఖాతా నుంచి రూ.10 వేలు డ్రా చేసినట్టు మెస్సేజ్ వచ్చింది. మోసపోయానని గుర్తించి బాధిత మహిళ హుటాహుటిన బ్యాంకుకు వెళ్లింది. జరిగిన విషయాన్ని బ్యాంకు అధికారులకు చెప్పి ఖాతాలో ఉన్న మిగతా డబ్బును విత్ డ్రా చేసుకుంది.
ప్రశ్నించిన మహిళ
ఇదే తరహాలో నిజామాబాద్ నగరం గాయత్రినగర్‌కు చెందిన మరో మహిళకు అదే రోజు ఓ అపరిచితురాలు వెరిఫికేషన్ పేరుతో మూడుసార్లు కాల్ చేసింది. మొదటిసారి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వివరాలు చెప్పాలంటూ అడిగింది. సైబర్ నేరాలపై అవగాహన ఉన్న సదరు మహిళ కాల్ కట్ చేసింది. ఐదు నిమిషాల తర్వాత మరో సారి కాల్ వచ్చింది. దానిని ఆమె లిఫ్ట్ చేయలేదు. మూడోసారి కూడా ఫోన్ రావడంతో సదరు మహిళ గట్టిగా నిలదీసింది. ఎందుకు వివరాలు అడుగుతున్నారని ప్రశ్నించడంతో అటువైపు నుంచి కాల్ కట్ అయింది.
అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఇటీవల పలువురికి ఈ తరహా ఫోన్లు వచ్చాయి. వారికి అనుమానం వచ్చి పోలీసులకి సమాచారం ఇచ్చారు. దీంతో ఆరా తీసిన పోలీసులకు నివ్వెరపోయే నిజం తెలిసింది. ఇది సైబర్ నేరగాళ్ల పనేనని గుర్తించారు. ప్రజా పాలన దరఖాస్తు దారులకు పోలీసులు పలు సూచనలు చేశారు. ఆరు గ్యారంటీల పేరుతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని, గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి ఓటీపీ అడిగితే చెప్పవద్దన్నారు. ఆరు గ్యారంటీలకు ఎంపికయ్యామని సంతోషంలో ఓటీపీ చెప్పి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసుకోవద్దని సూచించారు. ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి కాల్స్ ఎవరికైనా వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు.