Trains To Ayodhya From Andhra Pradesh And Telangana: ఉత్తరప్రదేశ్‌(Uttarpradesh) అయోధ్య(Ayodhya )లో రామ మందిరం(Ram Mandir) ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత రామ్‌ లల్లా ప్రతిష్ఠాపన ప్రక్రియను ప్రారంభించి, 10 రోజుల పాటు 'ప్రాణ ప్రతిష్ఠ' కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ ట్రస్టు నిర్ణయించింది. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు నాలుగు వేల మంది సాధువులు, 2,500 మంది ప్రముఖులు హాజరుకానున్నారు. జనవరి 22న పవిత్ర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగనుంది. 23 నుంచి సాధారణ ప్రజలకు శ్రీరాముడి దర్శన భాగ్యం కల్పించనున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం అయోధ్య రాముడిని దర్శించుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా రెండు రైళ్లు అయోధ్యకు చేరుకుంటాయి. 


కాచిగూడ మీదుగా గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్
యశ్వంతపుర నుంచి గోరఖ్‌పూర్ వెళ్లే రైలు (15024) కాచిగూడ మీదుగా అయోధ్యకు వెళ్తుంది. ప్రతి శుక్రవారం ఉదయం 10.50 నిమిషాలకు గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (15024) కాచిగూడలో బయల్దేరుతుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ధర్మవరం, అనంతపురం, కర్నూలు సిటీ, మహబూబ్ నగర్, కాచికూడా, ఖాజీపేట, సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్లలో ఆగుంది. 1690 కిలోమీటర్లు ప్రయాణించి శనివారం సాయంత్రం 4.30కు అయోధ్య చేరుకుంటుంది. 


విజయవాడ మీదుగా శ్రద్ధ సేతు ఎక్స్‌ప్రెస్
అలాగే తమిళనాడు లోని రామేశ్వరం నుంచి విజయవాడ  మీదుగా శ్రద్ధ సేతు ఎక్స్‌ప్రెస్ (22613) అయోధ్యకు వెళ్తుంది. ఈ రైలు విజయవాడలో ప్రతి సోమవారం రాత్రి 8.10 గంటలకు బయల్దేరి 1813 కిలోమీటర్లు ప్రయాణించి బుధవారం తెల్లవారుజామున  4.00 అయోధ్య జంక్షన్‌కు  చేరుకుంటుంది. గూడూరు, విజయవాడ, వరంగల్ స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది.  


అయోధ్యలో ప్రత్యేక ఏర్పాట్లు
దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు అయోధ్య పట్టణానికి పోటెత్తనున్నారు. యూపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలకూ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన భక్తులు రైలు మార్గంలో అయోధ్యకు చేరేందుకు వీలుగా రైల్వే సర్వీసులను భారీగా పెంచాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. రామ మందిరం తెరుచున్న తరవాత 100 రోజుల పాటు దేశంలోని పలు చోట్ల నుంచి 1000 రైళ్లు ప్రత్యేకంగా నడపనున్నట్టు వెల్లడించింది. 


జనవరి 19వ తేదీ నుంచి ఆ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మూడు రోజుల ముందు నుంచే ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడం వల్ల భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయోధ్యకు చేరుకునే అవకాశముంటుందని అధికారులు భావిస్తున్నారు. జనవరి 23వ తేదీ నుంచి రామ మందిరాన్ని భక్తులు దర్శించుకోవచ్చు. ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, పుణే, కోల్‌కత్తా, నాగ్‌పూర్, లక్నో, జమ్ము నుంచి ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది రైల్వే.  


దీంతోపాటు, కొన్ని రైళ్లను ప్రత్యేకంగా భక్తుల కోసం రిజర్వ్‌ చేసి ఛార్టెర్డ్‌ సర్వీసులు అందించనున్నట్లు సదరు వర్గాల సమాచారం. ఇక, ఈ రైళ్లలో ప్రయాణించే భక్తులకు ఆహారం అందించేందుకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని అయోధ్యలోని రైల్వే స్టేషన్‌లో ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. రోజుకు 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 15 నాటికి అయోధ్య స్టేషన్‌ పనులు పూర్తి కానున్నాయి.