Crop Loan Waiver: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు రోజుల క్రితం చేపట్టిన రుణ మాఫీ లెక్కను ఏ రోజుకారోజు ప్రభుత్వం వివరిస్తోంది. రెండు రోజుల్లో ఎంతమంది లబ్ధి పొందారో చెబుతోంది. రెండో రోజు అంటే శుక్రవారం రోజు 31 వేల 339 మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరినట్టు ప్రభుత్వం తెలిపింది. రూ.41 వేల నుంచి రూ.43 వేల మధ్య రుణాలు కల్గిన రైతులకు తెలంగాణ సర్కారు రూ.126.50 కోట్లు రుణాలను మాఫీ చేసింది. మొదటి రోజు మొత్తం రుణమాఫీకి సంబంధించి రూ.18,241 కోట్లకు ఆర్థిక శాఖ బడ్జెట్​ రిలీజ్​ ఆర్డర్​ (బీఆర్వో) విడుదల చేసింది. మొదటి విడతలో భాగంగా రూ.37 వేల నుంచి రూ.41 వేల మధ్య ఉన్న రైతు రుణాలను మాఫీ చేసేందుకు ఆర్థికశాఖ గురువారం రూ.237.85 కోట్లు విడుదల చేసింది. దీని ద్వారా 62,758 మంది రైతులకు లబ్ది చేకూరింది. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా 94 వేల 97 మంది రైతులకు చెందిన రూ.364.34 కోట్లకు రుణ విముక్తి కల్గింది. 






మొత్తం రుణాలను 45 రోజుల్లోగా అంటే సెప్టెంబర్‌ రెండో వారంలోగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును సీఎం ఆదేశించారు. సుమారు 29.61 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.19 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనున్నది. తాజా రుణమాఫీతో సుమారు 29.61 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనున్నదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంటే భారత ‘రైతు’ సమితి అని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. జై కిసాన్ అనేది తమకు కేవలం ఓ నినాదం కాదని, తమ ప్రభుత్వ విధానం అని తేలిపోయిందని చెప్పారు. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినా, బీజేపీ ర్కారు అడుగడుగునా ఆర్థిక ఇబ్బందులు సృష్టించినా, రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం.. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సంకల్ప బలానికి నిలువెత్తు నిదర్శనమని వెల్లడించారు.






రైతు సంక్షేమంలో తొమ్మిదేండ్ల తెలంగాణ ప్రస్థానం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయమని చెప్పారు. రైతుకు రక్షణ కవచంగా అమలుచేసిన ప్రతి పథకం వ్యవసాయ రంగ చరిత్రపై చెరగని సంతకమన్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయం అంటే సంక్షోభం.. కానీ, ఒక్క తెలంగాణలోనే వ్యవసాయం అంటే సంతోషమని పేర్కొన్నారు. యావత్ తెలంగాణ రైతాంగం ముక్తకంఠంతో చేస్తున్న నినాదమిదని సోషల్‌ మీడియా వేదికగా స్పష్టం చేశారు.