Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో రోజుకో వివాదం వెలుగు చూస్తోంది. ఏదో వివాదంతో నిత్యం వార్తల్లోకి ఉండటం బాసర ట్రిపుల్ ఐటీకీ కామన్ అయిపోయింది. తాజాగా ట్రిపుల్ ఐటీ మెస్‌లోని సిబ్బంది అక్కడే స్నానం చేస్తున్న తీరును విద్యార్థులు వెలుగులోకి తెచ్చారు. ఓవైపు వంట చేస్తుండగా మరోవైపు సిబ్బంది స్నానం చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలను విద్యార్థులు సెల్‌ఫోన్‌లో షూట్ చేశారు. వంట పక్కనే ఇంత నిర్లక్ష్యంగా స్నానాలు చేస్తుండటాన్ని విద్యార్థులు తప్పుబట్టారు. కనీస శుభ్రత పాటించటం లేదని వాపోతున్నారు. ఇటీవలి కాలంలో ఫుడ్ పాయిజన్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నిన్నటికి నిన్న విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. ఇంత జరుగుతున్నా సిబ్బంది మెస్‌లోనే ఇలా స్నానాలు చేయటంపై విద్యార్ఖులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పైకి చెబుతునారే తప్ప లోపల మరోలా ఉందని విద్యార్థులు మండిపడుతున్నారు.


అప్పట్లో వరుసగా మూడ్రోజులు అన్నంలో సాలె పురుగులు..


గతంలోనూ బాసర ఆర్జీయూకేటీ విశ్వ విద్యాలయంలో వరుసగా మూడు రోజులపాటు అన్నంలో సాలె పురుగులు వచ్చాయి. దీంతో విద్యార్థులంతా రోడ్డెక్కారు. ఈ విషయంపై విచారణ కోసం భైంసా ఆర్డీఓ లోకేశ్వర్రావు కూడా మెస్ సందర్శించారు. సాలె పురుగు వచ్చింది నిజమేనని.. దాన్ని ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు. మరోసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. అయినప్పటికీ కనీస వసతులు కల్పించడంలో అధికారులు పెద్దగా దృష్టి సారించకపోవడంతో దాదాపు 8 వేల మంది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. దాదాపు 10 రోజులపాటు వర్షంలో తడుస్తూనే.. ఆందోళన చేశారు. వీరి ఆందోళనతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగంలోకి దిగారు. అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత వైస్ ఛాన్స్‌లర్‌తో సమావేశం కూడా అయ్యారు.


గతంలోని సమస్యలపై కేటీఆర్ స్పందన..


విశ్వవిద్యాలయంలో మౌలిక సమస్యలపై చర్చించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఆదేశాలిచ్చారు. అయితే అదే విషయాన్ని తేజగౌడ్ అనే వ్యక్తి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. కనీస సదుపాయల కోసం దాదాపు 8 వేల మంది బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రోడ్డెక్కారని వివరించారు. స్పందించిన మంత్రి ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి వరకు తీసుకెళ్లాతమంటూ చెప్పారు. ఇలా సీఎం వరకు విషయం వెళ్లినా మళ్లీ ఇలాంటి సమస్యలే రావడంపై విద్యార్ఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోకపోవడం వల్లే సమస్యలు రిపీట్ అవుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అన్నం వండే చోట, తినే చోటే స్నానాలు చేయడం ఎలా ఉంటుందంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.