మంచిర్యాలలో నిర్వహించిన కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ సీఎం కేసీఆర్ హామీలు నెరవేర్చలేదన్నారు. తెలంగాణలో దళితులకు మూడు ఎకరాల భూమి, అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి.. సీఎం కేసీఆర్ ఆ హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. మరోవైపు ప్రభుత్వ రంగ పరిశ్రమలను విక్రయించడం వల్ల యువతకు ఉద్యోగాలు రావడం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల బాట పట్టించాల్సింది పోయి, ప్రైవేటీకరణకు మొగ్గు చూపడం దారుణమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆ ప్రకారం చూస్తే వారి 9 ఏళ్ల పాలనలో యువతకు 18 కోట్ల ఉద్యోగావకాశాలు కల్పించేదన్నారు. కానీ కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 


ఎస్సీల పేరు చెప్పుకుని పబ్బం గడుపుతున్నారు.. 
ప్రజాస్వామ్య ప్రక్రియలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ లేకపోయి ఉంటే ఎస్సీలు, మహిళలకు ఓటు హక్కు కోల్పోయే వారని మల్లికార్జున్ ఖర్గే అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం రచించడం ద్వారా ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేసిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు. అన్ని వర్గాలు, కులాలు, మతాల వారిని ఒకే రకంగా చూడాలని అంబేద్కర్ భావించారని చెప్పారు. కొందరు ఎస్సీల పేరు చెప్పుకుని పబ్బం గడుపుతున్నారని, ఓట్ల కోసం వారిని వాడుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం లేదని, కేంద్రంలో సైతం 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నా మోదీ సర్కార్ భర్తీ చేయడం లేదని ఖర్గే ఆరోపించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన కొనసాగుతోందని, వీటికి చరమగీతం పాడాలంటూ కాంగ్రెస్ శ్రేణులకు పార్టీ జాతీయ అధ్యక్షుడు పిలుపునిచ్చారు.  






రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రూ.500కే సిలిండర్: రేవంత్ రెడ్డి


కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ‘ఉమ్మడి హైదరాబాద్ బిడ్డ మల్లికార్జున్ ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడు అయ్యాక హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేపు కర్ణాటకలో , ఏడాది చివర్లో తెలంగాణలోనూ మనం అధికారంలోకి రాబోతున్నాం. ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ కు పూర్వవైభవం వస్తుంది, కేంద్రంలో నరేంద్ర మోదీని, రాష్ట్రంలో కేసీఆర్ మెడలు వంచేలా పార్టీ శ్రేణులు పని చేయాలని’ పిలుపునిచ్చారు. మంచిర్యాల నియోజకవర్గంలో నిర్వహించిన కాంగ్రెస్ భారత్ సత్యాగ్రహ సభలో సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కొత్త తరం నాయకులకు బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 8 నుంచి 10 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 


కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీతో రూ.5 లక్షల వరకు ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. సిలిండర్లను రూ.500కే ఇస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు, నియామకాల కోసం వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం టెన్త్ క్లాస్ పరీక్షలు సరిగ్గా నిర్వహించలేకపోయింది. టీఎస్ పీఎస్సీ ద్వారా ఎగ్జామ్ లు నిర్వహించడంలో ఫెయిల్ అయిందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు.