SC sub classification | మంచిర్యాల: ఎస్సీ వర్గీకరణ జరిగితేనే మాదిగ దాని ఉప కులాలు బాగుపడతాయని, ఉద్యోగాల్లోనూ సముచిత స్థానం లభిస్తుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారంలో శనివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా ధర్మ యుద్ధ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై సభలో మాట్లాడారు.
1994లో జులై 7న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఉన్న ఓ మారుమూల గ్రామంలో పుట్టిన ఎస్సీ వర్గీకరణ పోరాటం ఇప్పుడు దిల్లీ వరకు వెళ్లిందన్నారు. 2004లో ఎస్సీ వర్గీకరణకు కమీషన్ వేస్తే అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో మాలలదే పెత్తనం కొనసాగుతుందని. అందుకే ఆ పార్టీ ఎప్పుడూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందన్నారు. ముప్పై ఏళ్ల పోరాటాలను అమలు చేసుకోవడానికి మరో యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఆగస్టు 1న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో ఆరుగురు ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వడంతో మాదిగ జాతి విజయం సాధించినట్లయిందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసన సభ సాక్షిగా ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తామని చెప్పి ఇప్పుడు మాదిగ జాతిని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ చేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు.
నవంబర్ 6 నుంచి తెలంగాణలో సమగ్ర సర్వే
తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 6నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టనుంది. ఈ మేరకు టీచర్లు, హెడ్మాస్టర్లు, ఇతర సిబ్బందిని సర్వేకు సిద్ధం చేశారు. అందుకోసం రాష్ట్రంలో నవంబర్ 6 నుంచి సమగ్ర సర్వే ముగిసేవరకు ఒంటి పూడ బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం విడుదల చేసింది. దాదాపు 50 ప్రశ్నలతో రూపొందించిన సర్వేను స్కూల్ సమయం ముగిసిన తరువాత ఉపాధ్యాయులు చేస్తారు. ఇందుకోసం వారికి ప్రత్యేకంగా శిక్ష ఇచ్చినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.