MLC Jeevan Reddy comments againt TRS MLC Kavitha: వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తుండగా, మరోసారి నెగ్గి హ్యాట్రిక్ కొడతామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఎమ్మెల్సీ కవిత విషయంపై మరోసారి మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీనియర్ నేత జీవన్ రెడ్డి సైతం ఎమ్మెల్సీ కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత లోక్ సభ ఎన్నికల్లో కవిత ఓడిపోవడానికి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో గెలిచిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే కారణమని వ్యాఖ్యానించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కవిత ఎంపీగా గెలిస్తే తమపై పెత్తనం చెలాయిస్తుందని భావించి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కలిసి నిజామాబాద్‌లో ఆమె కనబడకుండా చేయాలని, కుట్రపూరితంగా వెన్నుపోటు పొడిచి ఆమెను లోక్ సభ ఎన్నికల్లో ఓడగొట్టారని జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కవిత ఓడిపోవడంతో ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ స్వతంత్రం వస్తుందని వారు భావించారని, అందుకే ఎమ్మెల్యేలు నిజామాబాద్ ఎంపీగా కవిత ఓడిపోయేలా చేశారని వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కవితపై కుట్ర చేశారు !
రాజకీయాల్లో ఎక్కడైనా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి, నేతల్ని ఓడించేందుకు అవతలి పార్టీలు వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. కానీ నిజామాబాద్ లో గత లోక్ సభ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. బీజేపీ నేత ధర్మపురి అరవింద్ చేతిలో నిజామాబాద్ ఎంపీగా కవిత ఓడిపోయారు. అయితే ఇందుకు ప్రతిపక్ష పార్టీలు కారణం కాదని, టీఆర్ఎస్ పార్టీలోనే కుట్రలు జరిగాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కవిత ఎంపీగా గెలిస్తే తమకు నిజామాబాద్ లో స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉండదని టీఆర్ఎస్ నేతలు భావించారని జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం కింద వచ్చే ఏడుగురు ఎమ్మెల్యేలు నెగ్గినా, కవిత ఓటమి కోసం పని చేశారని కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.
కవిత అమయాకురాలు కాదు, కానీ తప్పని ఓటమి !
తమపై కవిత ఆధిపత్యం చెలాయించకూడదంటే ఎంపీగా ఆమె ఓడిపోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావించారని, 30 వేలకు పైగా మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ పని చేశారన్నారు. కవిత నిజామాబాద్ లో లేకుంటే తమకు స్వేచ్ఛ, అధికారం వస్తాయని భావించి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కవిత ఓటమిని కోరుకున్నారని, కుట్ర చేశారని జీవన్ రెడ్డి పునరుద్ఘాటించారు. అంటే గత ఎన్నికల్లో కవిత ఎంపీగా ఓడిపోవడానికి ప్రత్యర్థి పార్టీలు కారణం కాదని, గులాబీ నేతల పాత్ర ఉందన్నారు. ఎమ్మెల్సీ కవితకు ఈ విషయం ముందుగానే తెలుసునని వ్యాఖ్యానించారు. అయితే కవిత అమాయకురాలు కాదని, కానీ అనుకోని పరిస్థితులు, సొంత పార్టీ నేతల కుట్రల ఫలితంగా ఓడిపోయిందని అభిప్రాయపడ్డారు. ఆమెకు ఇంటెలిజెన్స్ రిపోర్టులున్నాయని, అన్ని విషయాలు తెలుసు కానీ సొంత పార్టీ నేతల కుట్రల్ని కప్పి పుచ్చేందుకు కవిత ప్రయత్నిస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు.