KCR in Banswada: మొండి కత్తి మాకు దొరకదా? మాకూ దమ్ముంది, దుమ్ము కూడా మిగలదు - కేసీఆర్ వార్నింగ్

ABP Desam Updated at: 30 Oct 2023 05:10 PM (IST)

బాన్సువాడ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ఎంపీపై జరిగిన దాడి గురించి మాట్లాడారు.

బాన్సువాడ సభలో సీఎం కేసీఆర్

NEXT PREV

దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించారు. బాన్సువాడ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ఎంపీపై జరిగిన దాడి గురించి మాట్లాడారు. చేతకాని దద్దమ్మ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని కేసీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ఇది రాజకీయమా అరాచకమా అని ప్రశ్నించారు. కడుపు, నోరు కట్టుకొని పని చేస్తున్న వారిపై ఈ దాడులు ఏంటని ప్రశ్నించారు. పని చేతకాక, ఎన్నికలు ఎదుర్కొనే దమ్ము లేక ఈ దద్దమ్మలు కత్తులతో దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. వీరికి తెలంగాణ ప్రజానికమే ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపు ఇచ్చారు. 


ఇది కేసీఆర్ పైన జరిగిన దాడి - సీఎం



కత్తి పట్టుకొని పొడవాలంటే ఇంత మంది ఉన్నం మాకు కత్తి దొరకదా మొండిదో లండిదో మాకో కత్తి దొరకదా? మాకు తిక్క రేగితే దుమ్ము రేగుతుంది. పదేళ్లలో ఎన్నో ఎన్నికలు జరిగాయి. ప్రజలు గెలిపిస్తే గెలిచినం. చాతనైన కాడికి సేవ చేసినం తప్ప దుర్మార్గమైన పనులు చేయలే. ఇప్పుడు జరిగిన దాడి దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కాదు.. కేసీఆర్ మీద జరిగినట్లే. ఇది కనుక ఆపకపోతే మాకూ దమ్ముంది. మేమూ అదే ఎత్తుకుంటే దుమ్ము కూడా మిగలదు. గెలిపిస్తే పని చేయాలే. లేదంటే ఎవరిపని వారు చూసుకోవాలె. ఎద్దో ఎవుసమో ఏదోకటి. కానీ, లంగా చేతలు, గుండాగిరి ఏంది? -


‘‘కాంగ్రెస్ పాలకులు నిజాం సాగర్ కు ఏ గతి పట్టించారో తెలుసుకోవాలని అన్నారు. ‘‘పోచారం శ్రీనివాస్ రెడ్డికి తిరిగే కాలు ఊరుకోదు, చేసిన చెయ్యి ఊరుకోదు. ఆయనకు పని చేసే అలవాటు. నా నియోజకవర్గంలో కన్నా అధికంగా 11 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను బాన్సువాడ నియోజకవర్గానికి తెప్పించిన వ్యక్తి ఆయన. పోచారంను లక్ష పైచిలుకు మెజారిటీతో గెలిపించండి’’ అని కేసీఆర్ పిలుపు ఇచ్చారు.


ఫోన్లో వివరాలు తెలుసుకున్న సీఎం


ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజా తీర్పు ను ఎదుర్కోలేక ఇలాంటి భౌతిక దాడులు, హత్యా రాజకీయాలకు తెగబడడం సిగ్గుచేటు అని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల సమయం లో ఇటువంటి సంఘ విద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు బీఆర్ఎస్ నేతలకు, కార్యకర్తలకు అధినేత కేసీఆర్ పిలుపు ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై  ఎవరు దాడులకు పాల్పడ్డా సహించేది లేదని సీఎం అన్నారు. ప్రస్తుతం నియోజకవర్గాల పర్యటనలో ఉన్న సీఎం
ఈ దుర్ఘటన పై మంత్రి హరీశ్ రావు ను సీఎం ఫోన్లోఆరా తీశారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి మెరుగైన చికత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నేడు సీఎం కేసీఆర్ జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో పర్యటించారు. తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్నందున సీఎం కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్‌లో రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాలను చుట్టి వస్తున్నారు.

Published at: 30 Oct 2023 04:30 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.