Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరబోతుందా.. అంటే అవునన్నట్లుగానే అనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఉత్తర, ప్రత్యుత్తరాలతో విమనాశ్రయం ఏర్పాటుకు ముందడుగుపడింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ కాలనీని ఆనుకొని ఉన్న 362 ఎకరాల్లో విమానాశ్రయం అభివృద్ధికి కేంద్ర రక్షణ శాఖ అనుమతిచ్చింది. దాంతో పౌర విమానాల రాకపోకలతోపాటు ఎయిర్ ఫోర్స్ రాకపోకలకు అనుగుణంగా ఉమ్మడిగా అభివృద్ధి చేయాలని విమానయాన సాధికార సంస్థ(ఏఏఐ) భావిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ బుధవారం రక్షణ శాఖ లేఖ నెంబరు 8(6)/వీఐపీ/20122/(ఐఏఎస్) ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పుడున్న రన్‌వేను అభివృద్ధి చేయటం, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించటం.. విమాన రాకపోకలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయటానికి సంస్థ ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పూర్తి మార్గదర్శలాలు ఖరారు చేయాలని యోచిస్తోంది. నిజాం ఏలుబడిలో విమానాల రాకపోకలకు అనువుగా ఉన్న విమానాశ్రయం తర్వాత కాలంలో మరుగునపడింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు 2013 -2014 లో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు అనుగుణంగా అవసరమైన 1,502 ఎకరాల భూమి సేకరించేలా అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సర్వేచేసింది. 2014 మే 12న కేంద్రానికి నివేదిక ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014 జూన్ 6న కేసీఆర్ ప్రభుత్వం బేగంపేటలోని ఎయిర్ పొర్ట్ కార్యాలయానికి నివేదిక సమర్పించింది. అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేక విమానాశ్రయం ఏర్పాటు కలగానే మిగిలి పోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ కొలువుదీరిన తర్వాత ఎయిర్ పోర్ట్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
వరంగల్ జిల్లాలోని మామునూరు సహా ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని గతేడాది ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం లేఖరాసింది. తొలుత మామునూరుకు పచ్చజెండా ఊపిన కేంద్రం.. ఆదిలాబాద్ ప్రస్తావన చేయక కాస్త నిరాశను మిగిల్చింది. ఇటీవల ముగిసిన శాసనసభ బడ్జెట్ సమావేశాలల్లో తాము పంపించిన ప్రతిపాదనల్లో ఆదిలాబాద్ విమానాశ్రయం కూడా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించటం ప్రాధాన్యత రేకెత్తించింది. దీంతో తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో పాటు, తెలంగాణ ప్రజలందరికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకుముందు మామునూర్ ఎయిర్ పోర్టుకు అనుమతులు సాధించిన తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్‌కు అనుమతులు సాధించడంపట్ల ఆయన హర్షంవ్యక్తం చేశారు.
గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్టర్ లేఖ రాశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఎయిర్పోర్ట్ నిర్మాణ పునరుద్ధరణ పనులకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్టర్ సనప్ బాజీరావు రామ్నాథ్ స్పష్టం చేస్తూ లేఖ పంపారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌నకు సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్‌లను నడిపేందుకు వీలుగా తాము చర్యలు తీసుకుంటామని ఆ లేఖలో పేర్కొన్నారు.
రన్ వే అభివృద్ధి పనులతోపాటు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులకు సంబంధించిన చర్యల విషయంలో నిరభ్యంతర పత్రాన్ని ఇచ్చేందుకు అనుకూలత తెలిపారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు మళ్లీ జీవం పోసుకున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో తాజాగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అంశాన్ని లేవనెత్తారు. గత రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ లేఖలు కూడా రాసింది.
తాజాగా కేంద్రం ఈ విషయంలో స్పందించి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణ విషయంలో సానుకూలత వ్యక్తం చేయడంతో నిర్మాణ పనులకు మోక్షం కలుగుతాయని జిల్లా వాసులు భావిస్తున్నారు. తాజా నిర్ణయంపై ఎంపీ నగేష్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సహా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ రాకతో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.