Adilabad Latest News: సేవాలాల్ దీక్ష చేపట్టిన బంజారాలు కాలినడకన పాదయాత్ర చేపట్టారు. అదిలాబాద్ జిల్లా నుంచి మహారాష్ట్రలోని పొహరాదేవికి 300 కిలోమీటర్లు పాదయాత్రగా బయలుదేరారు. నార్నూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలోగల దీక్షాగురు ప్రెంసింగ్ మహారాజ్ ఆశీస్సులతో సేవాలాల్ దీక్ష చేపట్టి 41 రోజులపాటు దీక్షలు కొనసాగుతున్నాయి. ఉగాది పండుగ పురస్కరించుకొని కొత్తపల్లి నుంచీ పౌరాదేవికి పాదయాత్రగా బయలుదేరారు. మహిళలు పురుషులు చిన్నారులు పెద్దలు అందరు కుటుంబ సమేతంగా మండుటెండలో ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.
ఇంతకీ బంజారాల సేవాలల్ దీక్షా ప్రత్యేకత ఏంటీ.? వేసవిలోనే ఈ దీక్షలు ఎందుకు చేస్తారు.? మహారాష్ట్రలోని పౌరాదేవికి పాదయాత్రగా ఎందుకు బయలుదేరారు.? ఈ అంశాలపై గిరిజన సాంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్న బంజారాలతో abp దేశం స్పెషల్ రిపోర్ట్.
గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్న బంజారాలు తమ ఆచార సాంప్రదాయలను పాటిస్తూ పూర్వకాలం నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం గ్రామంలో కొలువైన జగదంబా దేవికి, సేవాలాల్ మహారాజ్‌కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తమ ఆరాధ్య దైవాలుగా సేవాలాల్ మహారాజ్, రామారావ్ మహారాజ్‌ను భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తూ ఆరాధిస్తున్నారు. ప్రతియేటా శివరాత్రి నుంచి సేవాలాల్ దీక్షలు పాటిస్తుంటారు. గులాబీ రంగు, తెల్లటి రంగు దుస్తులు ధరించి, కాళ్ళకు చెప్పులు లేకుండా 41 రోజులపాటు శ్రీరామనవమి వరకు దీక్షలు చేపడతారు. ఇందులో కొందరు ఉగాది పండుగ రోజున సైతం దీక్షలు చేపడతారు.
ఈ దీక్షలను నార్నూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో కొలువైన దీక్షా గురు ప్రేంసింగ్ మహారాజ్ సన్నిధానంలో చేపట్టారు. కేరమేరి మండలంలోని శంకర్ లొద్దిలో ప్రేంసింగ్ మహారాజ్ 1978లో తపస్సు చేశారని అంటారు. అప్పటి నుంచి ఆయన తపస్వి మహారాజ్‌గా ఈ సేవాలాల్ దీక్షలు ప్రారంభించారు. బంజారా సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా తమ ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్‌నూ పూజిస్తూ ఈ దీక్షలు కొనసాగుతున్నాయి. తమకు ఎలాంటి కష్టాలు రాకుండా అందరూ కలిసి మెలిసి ఉండాలని, తమ గ్రామం, పాడి పంటలు బాగాపండాలని మొక్కులు చెల్లిస్తుంటారు. ఇక ఎవరైనా తమ కోరిన కోరికలు మొక్కులు నెరవేరితే ఇలా దీక్షలు చేపడతూ మొక్కులు తీర్చుకుంటారు. భజన కీర్తనలు చేస్తూ అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అలా అప్పటి నుంచి ఈ దీక్షలు చేపడుతూ ఏటా తమ ఆరాధ్య దైవమైన జగదంబదేవికి, సేవాలాల్ మహారాజ్ ను భక్తి శ్రద్ధలతో కొలుస్తూ మహారాష్ట్రలోని పౌరదేవీకి పాదయాత్రగా వెళ్తూ ఆచార వ్యవహారాలతో కూడిన దీక్షల నడుమ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తాము ఏది అనుకుంటే అది నెరవేరాలన్న కుడా దీక్ష చేపట్టిన తరువాత అది కచ్చితంగా నెరవేరుతుందని బంజారాలు విశ్వసిస్తూ నేటికీ ఈ ఆచారాలనూ పాటిస్తూ దీక్షలు చేపడుతున్నారు. ఉగాది పండుగను పురస్కించుకుని కొత్తపల్లి గ్రామం నుంచి పాదయాత్రగా బయలుదేరగా... ఆయా జిల్లానుంచి భక్తులు సేవాలాల్ దీక్షా పరులు తరలి వచ్చి అదిలాబాద్ జిల్లాలో జత కట్టారు.
అదిలాబాద్ మీదుగా అందరూ కలిసి కిన్వట్ మీదుగా మహారాష్ట్రలోని పౌరాదేవికీ పాదయాత్రగా బయల్దేరారు. శ్రీరామనవమి రోజున పౌరా దేవికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి తమ దీక్షలను విరమింప చేస్తారని సేవాలాల్ దీక్షలు చేపట్టిన భక్తులు abp దేశానికి వివరించారు. వారి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందించే దిశగా అడుగులు వేస్తూ ఈ ఆచార సంప్రదాయాలను కాపాడుతున్నామని బంజారాలు చెబుతున్నారు.