కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించే గొంతును నొక్కేస్తూ, పత్రికా స్వేచ్ఛను హరిస్తుందని బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గుజరాత్ అల్లర్లకు సంబంధించి వాస్తవాలను చూపుతూ బీబీసీ మీడియా డాక్యుమెంటరీ తీస్తే, ఆ మీడియా ఛానల్ పై ఐటీ దాడులు చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.
బహుజన రాజ్యాధికార యాత్ర రెండవ విడతలో భాగంగా బుధవారం 180వ రోజు నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని పెంబి, ఖానాపూర్ మండలాల్లో పర్యటించారు. యాత్రలో భాగంగా పెంబి, ఖానాపూర్ మండలాలకు చెందిన పసుపుల, తాటిగూడ, లోత్యోర తండా, ఇటిక్యాల, పెంబి, మందపల్లి, ఖానాపూర్ లలో పర్యటించగా.. పలువురు ఆయన సమక్షంలో బీఎస్పీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరుతున్న వారికి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వారికి పార్టీ ఖండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను ఎందుకు పట్టించుకోలేదు
ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే అబద్దాలు, హామీలతో మంచి కామెడీ బ్లాక్ బస్టర్ సినిమా తీయవచ్చని, దాంతో వచ్చిన ఆదాయంతో తెలంగాణను అభివృద్ధి చేయవచ్చునని ఆయన ఎద్దేవా చేశారు. నేడు కొండగట్టును సందర్శించిన కేసీఆర్ రూ. 500 కోట్లు ప్రకటించడంపై ఆయన స్పందించారు. కేసీఆర్ కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనుచరులు దామోదర్ రావు వల్ల చనిపోయిన జలపతిరెడ్డి అనే రైతు కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కిసాన్ సర్కార్ అని చెప్పే బీఆర్ఎస్ రాష్ట్ర రైతులు చనిపోతే పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఇప్పటివరకు నిందితుడిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు.
ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఖానాపూర్ లోని సుర్జాపూర్ లో కడెం నదిపై నిర్మించాల్సిన ప్రాజెక్టును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలోని పొనకల్ లో నిర్మించుకుని ఖానాపూర్ ప్రజలకు అన్యాయం చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా ఖానాపూర్ ను రెవెన్యు డివిజన్ గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజి ఏర్పాటు చేయకుండా, ఎమ్మెల్యే సొంతంగా రెండు కాలేజీలు ఏర్పాటు చేసుకున్నారని మండిపడ్డారు.
అధికార పాలకులు మిల్లులు నిర్మించి రైతులను దోచుకుంటున్నారని తెలిపారు. నియోజకవర్గంలో విద్యా వ్యవస్థ దయనీయంగా ఉందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే మళ్లీ ఈ నెల 20న కేటిఆర్ ఖానాపూర్ కు ఏ ముఖం పెట్టుకొని వస్తారని ప్రశ్నించారు. ఖానాపూర్ ప్రజలు మిమ్మల్ని క్షమించరని హెచ్చరించారు.- 2016 నిర్మించిన పసుపుల బ్రిడ్జి వరదలకు కూలిపోయిందని, లక్ష కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వరదల్లో మునిగిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం నాణ్యత కంటే మామూళ్లకే ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.
మిషన్ భగీరథ నీళ్లు రాలేదు, డబుల్ బెడ్రూం ఇళ్లు రాలేదు
నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్లు రాలేదని, 35 వేల కోట్ల మిషన్ భగీరథ ప్రాజెక్టు ఏ ఇంటికి తాగునీరు ఇవ్వడం లేదన్నారు. అందుకే ఈ దోపిడీ పాలకులని గద్దె దించాలని, అందుకు బీఎస్పి పార్టీని ఆదరించాలని కోరారు. ఈ యాత్రలో బిఎస్పి రాష్ట్ర కార్యదర్శి సిడం గణపతి, జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్, జనరల్ సెక్రటరీ సతీష్, మహిళా నాయకురాలు లక్ష్మి, నియోజకవర్గ ఇంచార్జి బన్సీలాల్ నాయక్, నియోజకవర్గ అధ్యక్షులు రాజేష్, మహిళా నాయకురాలు హారతి తదితరులు పాల్గొన్నారు.