Adilabad Road Accident:
- మావల హరితవనం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
- ఇద్దరు మృతి మరోకరికి తీవ్ర గాయాలు


ఆదిలాబాద్ జిల్లా మావల హరితవనం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మావల హరితవనం సమీపంలో జాతీయ రహదారి పై ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు పరిచయం ఉండటంతో రోడ్డు పక్కన వాహనం నిలిపారు. వాహనాలను నిలిపివేసి రోడ్డు పక్కన మాట్లాడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఓ లారీ వారిపైకి దూసుకొచ్చింది. 
ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే 108 వాహనం ఈఎంటి కాశీనాథ్, పైలెట్ విట్టల్ గౌడ్ ఘటన స్థలానికి చేరుకున్నారు అయితే ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను పరిశీలించి పంచనామ నిర్వహించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృత దేహాలను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.


డ్రైవర్ అజాగ్రత్త వల్లనే ఘోర రోడ్డు ప్రమాదం
ఆదిలాబాద్ జిల్లా మావల హరితవనం సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని మావల ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. లారీ డ్రైవర్ అజాగ్రత్తగా వాహనం నడుపుతూ రోడ్డు పక్కన ఉన్న సేఫ్టీ పిల్లర్లను ఢీ కొంటూ రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొనటంతో ఇద్దరు మృతి చెందారని, మరొకరికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుల్లో దేవాపూర్ కు చెందిన ఫిరోజ్ ఖాన్, ఉట్నూర్ మండలం లక్కారం చెందిన దత్తు ఉన్నారు. గాయాలపాయల పాలైన మరో వ్యక్తి నగేష్ అని తెలిపారు. వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 


ఆర్టీసీ బస్సు లారీ ఢీ - కండక్టర్ మృతి
జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనగా.. బస్సు కండక్టర్ అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ఉన్న ఎనిమిది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు జగిత్యాల నుంచి వరంగల్ వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాద సమయంలో బస్సులో 8 మంది ప్రయాణికులు ఉన్నారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ రోజు కొండగట్టులో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. దీనికి కొద్ది దూరంలోనే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే చనిపోయిన కండక్టర్ కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లికి చెందిన సత్తయ్యగా పోలీసులు గుర్తించారు. సత్తయ్య చనిపోయాడని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్న మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటి పెద్ద చనిపోవడంతో అనాథలం అయ్యామంటూ ఆయన భార్యా, పిల్లలు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.