YSRCP Mla Rachamallu :  టీడీపీ నేతలు తనపై అసాంఘిక వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారని ఆ ఆరోపణలపై విచారణ చేయాలని ప్రొద్దుటూరు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి  విశాఖలోని సీబీఐ అధికారులను కోరారు. విశాఖ సీబీఐ ఆఫీసుకు వచ్చిన ఆయన రెండు పేజీల ఫిర్యాదు  ప్రతిని సీబీఐ అధికారులకు అందించారు. రెండు సార్లు ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా గెలిచానని ప్రజలకు సేవ చేస్తున్నానని కానీ టీడీపీ నేతలు, ముఖ్యంగా నారా లోకేష్ ప్రొద్దుటూరు వచ్చి తనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆ ఆరోపణల్లో దొంగ నోట్ల ముద్రణ దగ్గర్నుంచి క్రికెట్ బెట్టింగ్, ఇసుక మాఫియా, మాట్కా నిర్వహణ, భూకబ్జాలు, ఎర్రచందనం స్మగ్లింగ్,  అక్రమ మద్యం తయారీ వంటి ఆరోపణలు ఉన్నాయన్నారు.             


నారా లోకేష్ చేస్తున్న ఆరోపణలన్నీ తన వ్యక్తిత్వాన్ని కించ పరిచేలా ఉన్నాయని .. ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయించుకుని సత్యశీలత నిరూపించుకోమని సవాల్ చేశారని అందుకే సీబీఐ అధికారులకు ఈ విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పుకొచ్చారు. తనపై చేసిన అసాంఘిక కార్యకలాపాల ఆరోపణలన్నింటిపైనా విచారణ జరిపించాలని ...తన ఆర్జీని స్వీకరించాలని సీబీఐ జాయింట్ డైరక్టర్ ను రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కోరారు.           

   


తర్వాత మీడియాతో మాట్లాడిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రసపుత్ర రజనీ అనే వైఎస్ఆర్‌సీపీ కార్యకర్త బెంగళూరులో దొంగ నోట్లతో దొరికితే తనకేం సంబంధం అని ఆయన ప్రశ్నించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.   ప్రొద్దుటూరు నుంచి 800 కిలోమటర్ల పయనించి సీబీఐ ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదని.. కానీ తన సత్యశీలతను నిరూపించుకోవడానికే వచ్చానన్నారు. చంద్రబాబు లోకేష్ ఆధ్వర్యంలో తప్పుడు ప్రచారం జరుగుతోంది.. ఈ ప్రభుత్వము చేసే మంచిని సహించే పరిస్థితుల్లో వీరు లేరని ఆరోపించారు.  విష ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు వైఎస్ఆర్సిపిపై చేస్తున్నారని మండిపడ్డారు. 


నారా లోకేష్ రెండుసార్లు ప్రొద్దుటూరు వచ్చినప్పుడు  ఆరోపణలు చేశారని.. చంద్రబాబు టిడిపి నేతలు తనపై పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాచమల్లు ఆరోపించారు. క్రికెట్ బెట్టింగ్ ఇసుక మాఫియక దొంగ నోట్లు ముద్రిస్తున్నానని లిక్కర్ మాఫియా మట్కా వ్యాపారం, జూదం, భూకబ్జా ఎర్ర చందనం వ్యాపారం చేస్తున్నని ఆరోపించారని..  నన్ను తప్పు చేయలేదని నిరూపించుకోమన్నారని అందుకే.. విచారణ చేయాలని సీబీఐ ని కోరానన్నారు. తాను  సిబిఐ కార్యాలయానికి వచ్చి విచారణ చేయమని అడిగామంటే అది సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనకు నిదర్శనమని రాచమల్లు చెప్పుకొచ్చారు.           


సీబీఐ నేరుగా రాష్ట్రంలో విచారణ చేయడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వం సిఫారసు చేసిన కేసుల్లో విచారణ జరుపుతుంది. లేకపోతే కోర్టు ఆదేశిస్తే జరుగుతుంది. అయినప్పటికీ విచారణ చేయాలని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే స్వయంగా సీబీఐని కోరడంపై రాజకీయవర్గాల్లో ఆశ్చర్యం  వ్యక్తమవుతోంది.