BRS MLC Kavitha: రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Telangana News | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీకి నీరు అందిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.

BRS MLC Kavitha demands Turmeric Board | నిజామాబాద్: బనకచర్ల ప్రాజెక్టు వెనుక కుట్ర దాగి ఉందని, ప్రజా భవన్ లో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం తర్వాత చంద్రబాబు ప్రకటన చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డును ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఈ సందర్భంగా పసుపు రైతుల సమస్యలు, పసుపు ధరలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రజా భవన్ లో సమావేశం అనంతరం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు చేపడుతామని ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బ్రీఫ్ చేసిన తర్వాతనే ఈ ప్రకటన వచ్చింది.
నోట్ల బ్యాగుతో దొరికిన రేవంత్ రెడ్డి..
గోదావరి నుంచి 200 టీఎంసీలు తరలించడానికి ఏపీ బనకచర్ల ప్రాజెక్టు చేపడుతోంది. తెలంగాణ దగ్గరి నుంచి నీటిని ఏపీ ఎత్తుకపోతుంటే చేతకాని సీఎం రేవంత్ రెడ్డి చూస్తూ నిలబడ్డారు. ఎందుకంటే నోట్ల బ్యాగుతో దొరికిన రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది. చంద్రబాబుకు కేంద్రం మద్దతు ఉంది. అందుకే కేంద్రం, ఏపీ ఎలా చెబితే రేవంత్ రెడ్డి అలా ఆడతారు. తెలంగాణ మంచి కోరినట్లయితే చంద్రబాబు ప్రాజెక్టు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ ఎందుకు రాయడం లేదు. రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టుల్లో కేసులు వేయకపోవడంతో అనుమానాలు నిజమయ్యాయి.
ఆనాడు ఏపీ ప్రాజెక్టులు చేపడితే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖలు రాశారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతుల కంటే చంద్రబాబుపై ఎక్కువ ప్రేమ ఉందా ? ఈ విధంగా గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా ?. రాష్ట్ర రైతుల ఉసురు తీసి గోదావరి, కృష్ణా జలాలు ఏపీకి ఇచ్చి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా ?. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి రాయాలి. అవసరమైతే కోర్టుకు వెళ్లి బనకచర్ల ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయాలి.
పసుపు బోర్డుకు చట్టబద్ధత లేదు
కేంద్రం నామమాత్రంగా పసుపు బోర్డు ఏర్పాటు ఏర్పాటు అంటూ గెజిట్ జారీ చేసింది. ఆ పసుపు బోర్డుకు చట్టబద్ధత లేదు. కనుక పసుపు ధరలు పడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ పసుపు బోర్డుకు చట్టబద్ధత ఉంటే బయటి దేశాల నుంచి నాసిరకం పసుపు దిగుమతులు తగ్గుతాయి. స్థానిక రైతుల పసుపునకు మంచి రేటు లభిస్తుంది. నాలుగైదు రోజులు ఎదుచూసినా పసుపు కొనడం లేదు. సిండికేట్ గా మారి పసుపు ధర తగ్గిస్తున్నారు. ఎంత నాణ్యత ఉన్నా పసుపునకు ధర లభించడం లేదు.
రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ పసుపునకు 12 వేల కనీస ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. దాని కంటే తక్కువ ధర ఉంటే బోనస్ రూపంలో మిగతా డబ్బును ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. పసుపుకు తక్షణమే బోనస్ ప్రకటించాలని మా డిమాండ్. పసుపు బోర్డుకు చట్టబద్ధత కల్పించడంతో పాటు, కనీస మద్ధతు ధర ఇచ్చే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. మార్చి 1వ తేదీలోపు పసుపు పంటకు బోనస్ ప్రకటించకపోతే జిల్లా కలెక్టరేట్ ను దిగ్భందిస్తాం’ అని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.
Also Read: SLBC Tunnel Collapse: కూలిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, సొరంగంలో చిక్కుకున్న 50 కార్మికులు
రేవంత్ రెడ్డి సీఎం కావడం తెలంగాణ ఖర్మ
తనపై చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. ‘ఆఖరికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా రేవంత్ తీరు మారలేదని, తనపై కామెంట్స్ చేయవద్దని కోర్టు చీవాట్లు పెట్టినా తనపై మాట్లాడుతూనే ఉన్నారని కవిత ప్రస్తావించారు. సుప్రీం కోర్టు తిట్టిన మొట్టమొదట సీఎం రేవంత్ రెడ్డి కావడం తెలంగాణకు పట్టిన ఖర్మ. నేను రేవంత్ రెడ్డిలా మాట్లాడి నా స్థాయిని తగ్గించుకోలేను. నోరుంది కదా అని, ఆయనలా మాట్లాడలేనని’ కవిత వ్యాఖ్యానించారు.