Kavitha News: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ నిర్ణయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణలు, ఆ తర్వాత జైలు జీవితం, జైలు నుంచి వచ్చాక పార్టీ ప్లీనరీ, ఈ సందర్భంలో ప్లీనరీపై కేసీఆర్ కు లేఖ రాయడం, ఆ లేఖ బహిర్గతం కావడం, పార్టీలో కీలక నేతలపై విమర్శలు వంటి పరిణామాల నడుమ కవిత తన దారి తాను చూసుకుంటారా అన్న చర్చ సాగుతోంది. అందుకు జులై 17వ తేదీన రైలు రోకో కార్యక్రమం పిలుపు ద్వారా స్వంత ఎజెండాతో ముందుకు సాగుతుందా అన్న చర్చ రాజుకుంటోంది. ఈ రైలు రోకో కార్యక్రమానికి వామపక్ష పార్టీలను ఆహ్వానిస్తోన్న కవిత, తన సొంత పార్టీ అయిన బీఆర్ఎస్ ను ఆహ్వానిస్తుందా లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అసలు కవిత ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నట్లా, లేనట్లా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

బీసీ ఎజెండాతో రైలు రోకోకు పిలుపు ఇచ్చిన కవిత

బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు లేఖ రాయడం, అది బహిర్గతంకావడం తర్వాత గులాబీ పార్టీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. కవిత వ్యాఖ్యలు అందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఆమె చేసిన వ్యాఖ్యలు స్వయాన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనే అని అందరూ చర్చించుకునేలా రాజకీయ పరిణామాలు సాగాయి. ఆ తర్వాత కొంత పార్టీకి దూరంగా ఉన్న కవిత, తన సొంత సంస్థ అయిన జాగృతిని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. జాగృతి కమిటీలు వేయడం, కొత్త కార్యాలయం ప్రారంభించడం, సొంతంగా కార్యాచరణ ప్రకటించడం వంటి చర్యలతో తాను సొంతంగా ఎదగాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కాళేశ్వరం కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత బీసీ ఎజెండా ఎత్తుకుని 42 శాతం రిజర్వేషన్ల కోసం సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ అంశంపైనే జులై 17వ తేదీన రైలు రోకో కార్యక్రమానికి పిలుపునివ్వడం గమనార్హం. ఇలా దూకుడుగా తన కార్యాచరణతో ముందుకు సాగుతున్న కవిత విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మౌనంగా ఉండటం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమానికి మద్దతు కోరుతూ వామపక్ష పార్టీలైన సీపీఎం, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నేతలను కవిత స్వయంగా కలవడం మరో సంచలనంగా మారింది. వారితోపాటు రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యను కలిసి మద్దతు కోరారు.

ఇప్పటికీ బీఆర్ఎస్‌లో కీలక పార్టీ నేతగా, పార్టీ ఎమ్మెల్సీగా కవిత ఉన్నారు. ఈ క్రమంలో పార్టీకి సంబంధం లేకుండా కార్యాచరణ ప్రకటించడం, ఇతర పార్టీ నేతలను కలవడం ఇప్పుడు గులాబీ పార్టీలో చర్చకు దారి తీసింది. ఇంతకు కవిత బీఆర్ఎస్‌లో ఉన్నట్లా, లేనట్లా అన్న ప్రశ్నలను గులాబీ నేతలు సంధిస్తున్నారు. ఇంత జరుగుతున్నా దీనిపై పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సహజంగా వేరే ఏ ఇతర నేతలు ఇలా చేసినా పార్టీ వ్యతిరేక కార్యక్రమాల కింద షోకాజ్ నోటీస్ జారీ చేయడమో లేక పార్టీ నుంచి సస్పెండ్ చేయడమో చేసే సంప్రదాయం గులాబీ పార్టీలో ఉంది. అలాంటిది కవిత విషయంలో ఈ మౌనం ఏంటన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

వామపక్షాలకు అందిన ఆహ్వానం బీఆర్ఎస్ కు కవిత పంపుతుందా?

జులై 17వ తేదీన తలపెట్టిన రైలు రోకో కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీ నేతలను కలిసి కవిత కోరడం ఇప్పుడు మరో చర్చకు దారి తీస్తోంది. బీసీ రిజర్వేషన్ సాధన అనేది అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాలకు వ్యతిరేక పిలుపుగా జాగృతి నేతలు చెబుతున్నారు. ఈ కారణాలతో ఈ రెండు పార్టీలను కవిత కలిసి మద్దతు కోరే అవకాశం లేదు. ఇక మిగిలిన అతి పెద్ద పార్టీ బీఆర్ఎస్. మరి ఈ విషయంలో తన స్వంత పార్టీ మద్దతు కవిత కోరుతుందా లేదా అన్న ప్రచారం ఇప్పుడు తెలంగాణలో విస్తృతంగా సాగుతోంది. ఈ విషయంలో స్వయంగా కవిత పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ను, లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి కోరనుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటి వరకు కవిత ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం గమనార్హం. రానున్న రోజుల్లో బీఆర్ఎస్‌కు ఆహ్వానం పంపే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

స్వతంత్ర నాయకురాలి గుర్తింపు దిశగా కవిత అడుగులు

పార్టీకి లేఖ రాసిన తర్వాత పరిణామాలన్నీ కవిత తాను ఒక బీఆర్ఎస్ నాయకురాలిగా కాకుండా, స్వతంత్ర నేతగా ఎదిగే దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. సొంత పార్టీ నుంచి కాకుండా తన తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా కార్యాచరణ చేపట్టడం, స్వంత పార్టీని పక్కన పెట్టి ఇతర పార్టీ నేతల మద్దతు కోరడం ఇందులో భాగమేనని చెబుతున్నారు. బీఆర్ఎస్‌లో ఆమె భవిష్యత్తు ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మౌనం పాటించడం రాజకీయ వ్యూహమా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం, కవిత ఈడీ కేసులో అరెస్ట్ కావడం వంటి విపత్కర స్థితిలో కవిత వంటి నేత ప్రజల్లోకి వెళ్లి ఆయా వర్గాల మద్దతు కూడగట్టే దీర్ఘకాలిక వ్యూహమా అన్న చర్చ సాగుతోంది. ఈ కేసుల నుంచి బయటపడి ప్రజానాయకురాలిగా ఎదగడం అనే అంశం దీని వెనుక ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఈ రైలు రోకో అన్న కార్యక్రమం కేవలం బీసీ రిజర్వేషన్ల సాధన అంశంగానే చూడలేం. ఇది కవిత రాజకీయ జీవితానికి ఓ కీలక మలుపుగానే చెప్పాలి. ఈ రైలు రోకోకు బీఆర్ఎస్‌ను కవిత ఆహ్వానిస్తుందా? గులాబీ కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొంటారా? కవిత దూకుడు విషయంలో కేసీఆర్, కేటీఆర్ స్పందన ఎలా ఉంటుంది? బీఆర్ఎస్ లో కవిత భవిష్యత్తు ఏంటి? రైలు రోకో తర్వాత కవిత వ్యూహం ఎలా ఉంటుంది? అన్న విషయాలు తెలియాలంటే మరి కొంత కాలం మనం వేచి చూడాల్సిందే.