BRS chief KCR in Nizamabad- నిజామాబాద్‌: కేసీఆర్ కుంటుతున్నా, బస్సు ఎక్కి గర్జన చేసిండు కనుక నేడు రైతుబంధు పడుతుందని తెలంగాణ మాజీ సీఎం వ్యాఖ్యానించారు. ఇయ్యాల బీఆర్ఎస్ పిడికిలి బిగిస్తేనే దెబ్బకి దెయ్యం వదిలి, వణుకు మొదలై సీఎం రేవంత్ రెడ్డి రైతుబంధు (Rythu Bandhu) వేస్తున్నాడు కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ శక్తి బీఆర్ఎస్. తెలంగాణ బలం బీఆర్ఎస్. తెలంగాణ గళం బీఆర్ఎస్ అన్నారు. నిజామాబాద్‌ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ.. పదేళ్ల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ 150 నినాదాలు చెప్పారని, అందులో ఒక్కటైనా నిజమైందా? అని ప్రశ్నించారు. మోదీ పాలనలో తెలంగాణకు ఏ మేలు జరగలేదన్నారు. 


వాళ్లు మోదీ ముందు చేతులు కట్టుకుని నిల్చుంటరు 
నిజామాబాద్‌ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డిని గెలిపించాలని ప్రజల్ని కేసీఆర్ కోరారు. నిజామాబాద్‌ పాత కలెక్టరేట్‌ నుంచి నెహ్రూచౌక్‌ చౌరస్తా వరకు కేసీఆర్ రోడ్‌ షో నిర్వహించారు. అనంతరం అక్కడి సభలో మాట్లాడుతూ.. తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల, మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి? అని ప్రశ్నించారు. మోదీ ముందు చేతులు కట్టుకుని నిల్చుంటరు తప్ప నోరు మెదపని బీజేపీ ఎంపీలు మనకు అవసరమా? అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. మోదీ అచ్చే దిన్‌ అంటే.. రైతులకు చచ్చేదిన్‌ వచ్చిందని మండిపడ్డారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని బీజేపీ చెప్పిందని, కానీ వాళ్ల సాగు ఖర్చు మాత్రం డబుల్ అయ్యిందని గులాబీ పార్టీ అధినేత ఎద్దేవా చేశారు. పదేళ్ల పాలనలో రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు, పసుపు బోర్డు ఇస్తామని చెప్పి బీజేపీ ఎంపీ మోసం చేశాడని ఆరోపించారు. 


కాంగ్రెస్ హామీలు నెరవేరేది ఎన్నడో!
ఎన్నో మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు కేసీఆర్. కానీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలు అమలు చేయకుండా, కాలయాపన చేస్తోందని విమర్శించారు. వరి పంటకు బోనస్‌ ఇస్తామని, రైతు కూలీలకు నగదు, రైతు బంధు ఇచ్చిందా అని ప్రశ్నించారు. తాను పిడికిలి బిగించి బస్సెక్కి ప్రశ్నించగానే తెలంగాణలో రైతు బంధు నగదు పడుతోందన్నారు. కేసీఆర్ కిట్ సైతం నిలిచిపోయింది, పెళ్లి చేసుకున్న వారికి కళ్యాణ లక్ష్మీ కింద తులం బంగారం ఎందుకు ఇస్తలేరని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ కు రేవంత్ నిధులు ఇవ్వడం లేదు, రూ.2 లక్షల రుణమాఫీ చేసేంత వరకు బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. 


చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వకుండా, వారిని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. దాంతో రాష్ట్రంలో మళ్లీ చేనేత కార్మికుల ఆత్మహత్యలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేతకాని తనంతో తెలంగాణకు వచ్చే పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి పోతున్నాయని, పాత కంపెనీలు సైతం రాష్ట్రం నుంచి వెళ్లిపోతే పరిస్థితి నెలకొందని.. అందుకు కాంగ్రెస్‌ పార్టీ అసమర్థత కారణం అన్నారు.
Also Read: కవితను అరెస్ట్ చేయలేదని, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతింది: అర్వింద్