Heavy Rains in Mancherial District | మంచిర్యాల జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లోనీ పలు గ్రామాలకు లోలెవల్ వంతెనలు నీట మునిగి పలు చోట్ల తాత్కాలిక వంతెనలు కొట్టుకుపోయి రాకపోకలు స్తంభించాయి.


గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు 
చెన్నూర్ మండలంలో భారీ వర్షాలకు అక్కేపల్లి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో అక్కేపల్లి, శివలింగాపూర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించిన పరిస్థితి నెలకొంది. ప్రధాన రహదారి కావడంతో ప్రతీ యేటా వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రతీ యేటా వర్షా కాలంలో వాగు ఉప్పొంగడం జనం ఇబ్బంది పడటం కామన్ అయిపోయింది. వాగుపై వంతెన నిర్మించాలని ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.




వాగు లో లెవల్ వంతెన కొట్టుకుపోయింది 
అటూ కోటపల్లి మండలంలోని నక్కలపల్లి గ్రామం వద్ద గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతు వాగు లో లెవల్ వంతెన కొట్టుకుపోయింది. దీంతో సుమారు ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా.. శనివారం లోతు వాగు వంతెన దాటే క్రమంలో ఓ ద్విచక్రవాహనదారుడు అదుపు తప్పి పడిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు ఆయనని రక్షించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్, రామగుండం సిపి శ్రీనివాస్ సూచించారు. అధికారులు సైతం అప్రమత్తంగా ఉండి అత్యవసర సమయాల్లో సహయక చర్యలు అందించేలా సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలోని వర్షాభావ ప్రభావిత ప్రాంతాల ప్రజలు అత్యవసరం తప్ప ఎవరూ బయటికి రావద్దని, వాగులు ఉప్పొంగి ప్రవహించే రహదారులగుండా ఎవరు వెళ్లే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు.
Also Read: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్ - రెండు రోజులు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు హెచ్చరికలు 


మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కొన్నిచోట్ల తేలికపాటి జల్లుల నుంచి సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలు కురిసే చోట, అత్యవసరమైతే తప్పా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని.. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజల్ని హెచ్చరించారు.