Rathod Bapurao Quits BRS, likely to Join Congress:


ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ఈనెల 21న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే బాపురావ్ మంగళవారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. అనంతరం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే బాపురావ్, ఈనెల 21న ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు బుధవారం ఆయన వెల్లడించారు. 


బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకీ మారుతున్న క్రమంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ కు షాక్ తగిలింది. బాపురావ్ పై చీటింగ్ కేసు నమోదైయింది. బేల మండలంలో 2 ప్లాట్లను ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ తో పాటు ఆయన వ్యాపార భాగస్వామి సుదర్శన్ 2012న ఓ వ్యక్తి కి విక్రయించారు. అవే 2 ప్లాట్లను 2019న మరో వ్యక్తికి అమ్మడంతో తొలత ప్లాట్ కొనుక్కున్న వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆదిలాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యేతో పాటు సుదర్శన్ పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్ బుధవారం తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరబోతున్నందుకే కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారని ఆయన సన్నిహితులు ఆరోపిస్తున్నారు. నాలుగేళ్ల కిందట జరిగిన విక్రయాలకు సంబంధించి ఇన్నేళ్లకు చీటింగ్ నమోదు చేయడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 


బీఆర్‌ఎస్‌కు షాక్ ఇస్తున్న నేతలు- ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు రాజీనామా  
పోలింగ్ దగ్గరకు వస్తున్న కొద్దీ తెలంగాణ అధికార బీఆర్‌ఎస్ పార్టీకి షాక్‌లు తగులుతున్నాయి. ఒకేరోజు ఓ ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే గుడ్ బై చెప్పేశారు. టికెట్ రాకపోవడంతో అసంతృప్తితోనే వీళ్లద్దరు పార్టీ మారుతున్నట్టు తెలుస్తోంది. బోధన్ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పేశారు. ఆయన  మంగళవారం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు.  ఉదయం రేవంత్‌ నివాసానికి వచ్చి రాజకీయాలపై చర్చించారు. బీఆర్‌ఎస్ తరఫున గత ఎన్నికల్లో విజయం సాధించిన బాపురావును కాదని ఇప్పుడు వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. ఆయనకు బదులు అధినాయకత్వం అనిల్‌ జాదవ్‌ అనే వ్యక్తికి టికెట్ ఇచ్చింది. దీంతో బాపురావు పార్టీ మారాలని నిర్ణయించారు. రేవంత్‌తో మాట్లాడిన అనంతరం ఆయనకు బోధన్ టికెట్ కన్ఫామ్ అయినట్ట ప్రచారం నడుస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని భావించారు. 


మరోవైపు ఆదిలాబాద్ జిల్లా ముధోల్‌ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు కూడా బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పేశారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌ ఠాకూర్‌తో సమావేశమయ్యారు. రాహుల్, ప్రియాంక సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఆయన ముధోల్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. 


ఈసారి 8 మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ దొరకలేదు. ఉప్పల్‌ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్‌ ఎమ్మెల్యే రాజయ్య, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్, వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్దన్‌, బోధ్‌ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌కు టికెట్ నిరాకరించారు. దీంతో వీళ్లలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.