Telangana Janasena - BJP : తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ గేర్ మార్చినట్టు కనిపిస్తోంది. ఓ వైపు అభ్యర్థులను ఖరారు చేసే కసరత్తు చేస్తూనే మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. అందులో భగంగానే జనసేన మద్దతు కోరారు. పవన్ కల్యాణ్‌తో ప్రత్యేకంగా సమావేశమైన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని రిక్వస్ట్ చేసినట్టు తెలుస్తోంది.  తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే రానుంది. 


తెలంగాణలో 32 చోట్ల పోటీ చేస్తామని జాబితాను జనసేన పార్టీ విడుదల చేసింది. అయితే హఠాత్తుగా పోటీపై వెనక్కి తగ్గవద్దని పవన్ కల్యాణ్ ను ఆ పార్టీ నాయకులు కోరినట్లుగా .. జనసేననే ప్రకటించింది. అసలు వెనక్కి తగ్గే ప్రస్తావన ఎందుకు వచ్చిందన్నది జనసేన వర్గాలు అర్థం చేసుకోలేకపోతున్నాయి. తెలంగాణలో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు పవన్ తో సమావేశమయ్యారు. 2018లో కొత్త రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తావివ్వరాదన్న ఉద్దేశంతో పోటీ చేయరాదన్న అధ్యక్షుని అభిప్రాయాన్ని గౌరవించి పోటీకి పట్టుపట్టలేదని తెలిపారు. మిత్రపక్షమైన బి.జె.పి. విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో పోటీ నుంచి విరమించుకున్నామని, ఈసారి తప్పనిసరిగా పోటీ చేస్తామన్నారు.                            


ఎన్నాళ్ళ నుంచో ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నామని, ఈ దఫా పోటీ చేయకపోతే తెలంగాణాలో పార్టీ ఎదుగుదలను చేతులారా ఆపుకున్నట్లవుతుందన్నారు. ప్రజల ముందుకు భవిషత్తులో బలంగా వెళ్లడం కష్టమేనని, క్యాడర్ నిరుత్సాహానికి గురవుతారని స్పష్టం చేశారు. పోటీ విషయంలో తన మీద ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని పవన్ కల్యాణ్ అంగీకరించారు. అయితే నాయకులు, జన సైనికులు, వీర మహిళల అభిప్రాయాలను గౌరవిస్తానని అన్నారు. సరైన నిర్ణయం తీసుకోడానికి ఒకటిరెండు రోజుల సమయం అవసరమని పవన్ కల్యాణ్ వారికి తెలిపారు. తెలంగాణలో పోటీ చేయడానికి పవన్ అనుమతి లేకుండా స్థానాలను ప్రకటించే అవకాశం లేదు. మరి ఎందుకు వెనక్కి తగ్గే ఆలోచన ఉన్నట్లుగా ప్రకటన చేస్తున్నారన్నది సస్పెన్స్ గా మారింది.                                 


ఈ ప్రకటన వచ్చిన తర్వాతి రోజు ఉదయమే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పవన్ కల్యాణ్ ను కలిశారు. అయితే పూర్తి స్థాయిలో పోటీకి దూరంగా ఉండే అవకాశం లేదని.. చాలా కాలంగా పోటీ కోసం ఎదురు చూస్తున్న జనసేన నేతలు.. అసంతృప్తికి గురవుతారని అంటున్నారు. అందుకే ముఖ్య నేతలకు అయినా పోటీ చేసే అవకాశాన్ని కూటమిలో భాగంగా పవన్ కల్యాణ్ ఇప్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేయడమా లేకపోతే బీజేపీకి మద్దతు ఇవ్వడమా అన్నదానిపై  తెర వెనుక కొన్ని అంతర్గత రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయని.. పవన్ సమావేశం ద్వారా స్పష్టమయిందని చెబుతున్నారు.