Soyam Bapurao: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పార్టీ మారుతున్నారని, బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరగడం తెలిసిందే. అయితే అవన్నీ తప్పుడు వార్తలని, కొందరు తనను టార్గెట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు సోయం బాపూరావు. పార్టీ మారుతున్నట్లు తనపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చేశారు. తనపై అర్థం లేని ఆరోపణలు చేయడం బాధాకరమని, తాను పార్టీ మారుతున్నానని కొందరు పని పెట్టుకుని మరీ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 27వ తేదీన తన కుమారుడి వివాహం ఉందని.. పెళ్లికి ఆహ్వానించేందుకు అన్ని పార్టీల నాయకులను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీలకు అతీతంగా పెళ్లికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నట్లు బీజేపీ ఎంపీ పేర్కొన్నారు. అందులో భాగంగానే కేసీఆర్ ను, రేవంత్ రెడ్డిని కూడా పెళ్లికి ఆహ్వానిస్తానని స్పష్టం చేశారు. అంతేకానీ అందులో తాను పార్టీ మారుతానన్న ఉద్దేశం లేదని ఆదిలాబాద్ ఎంపీ తేల్చి చెప్పారు.


మహేశ్వర్ రెడ్డితో గొడవల్లేవు


మహేశ్వర్ రెడ్డిని బీజేపీలోకి తానే ఆహ్వానించిన విషయాన్ని సోయం బాపూరావు గుర్తు చేశారు. మహేశ్వర్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న అసత్య ప్రచారం వెనక బీఆర్ఎస్ హస్తం ఉందని సోయం బాపూరావూ అనుమానం వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన దేశ అంతటా గెలిచినట్లు కాదని ఎద్దేవా చేశారు. బీజేపీ కర్ణాటకలో ఓడిపోయినా.. ఓట్ల శాతం ఏమాత్రం తగ్గలేదని చెప్పారు. 


జూపల్లి, పొంగులేటి దారి ఎటువైపు


బీఆర్ఎస్ నుండి సస్పెండైన జూపల్లి, పొంగులేటిలు ఇతర పార్టీల్లో చేరికలపై కొన్ని రోజులగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ తర్వాత వీరు బీజేపీలో చేరుతారా, కాంగ్రెస్ తో హస్తం కలుపుతారా అని రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ ఇద్దరు నేతలను చేర్చుకునేందుకు రెండు జాతీయ పార్టీల నాయకులు గట్టిగానే శ్రమిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆయా పార్టీల నాయకులు జూపల్లిని, పొంగులేటిని కలిశారు. ఈ క్రమంలోనే సోయం బాపూరావు కూడా పార్టీ మారుతారని, కర్ణాటక ఎన్నికల్లో గెలుపు తర్వాత ఊపులోకి వచ్చిన కాంగ్రెస్ లోకి చేరుతారన్న ప్రచారం జోరుగా జరిగింది. ఈ ప్రచారంపైనే తాజాగా సోయం బాపూరావూ స్పందిస్తూ తనపై వస్తున్న వార్తలను ఖండించారు. 


ఎటూ తేల్చుకోలేకపోతున్న జూపల్లి , పొంగులేటి


ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో జూపల్లి.. ఎవరికి వారే బాగా పట్టున్న నేతలుకావడంతో వారిద్దరినీ పార్టీలో చేర్చుకోవటం వల్ల వచ్చే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ నాయకత్వం  చాలా ఆఫర్లు ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది.  అయితే అప్పటికప్పుడు జెండా కప్పుకోకుండా కర్ణాటక ఎన్నికల ఫలితాల వచ్చాక తుది నిర్ణయం తీసుకుంటామని ఈటల బృందానికి పొంగులేటి హామీ ఇచ్చారు. అయితే కర్ణాటక ఫలితాలు బీజేపీకి ఎంత షాకిచ్చాయో.. పొంగులేటి, జూపల్లికి కూడా అంతే షాకిచ్చాయి. శనివారం ఫలితాలు వెల్లడయ్యాక జూపల్లి, పొంగులేటి ఫోన్లో సుదీర్ఘంగా చర్చించుకున్నారని... బీజేపీలో చేరే అంశాన్ని వాయిదా వేసుకున్నారని అంటున్నారు.