Basara Vehicle Fire Accident: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. బాసర మండల కేంద్రంలోని శ్రీ జ్ఞాన సరస్వతి కళ్యాణ మండపంలో అగ్ని ప్రమాదం చేసుకుంది. కల్యాణ మండపంలో వివాహ వేడక జరుగుతుండగా.. పెళ్లి అనంతరం స్నేహితులు, బంధువులు టపాసులు పేల్చారు. ఈ క్రమంలోనే  టపాసులు పేలి టెంట్ హౌస్ కు నిప్పు అంటుకుంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా.. బంధువులు, స్నేహితులు, వధూవరులను బయటకు తీసుకవచ్చారు. మంటలను చల్లార్చారు. అదృష్టవశాత్తు ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదు. కానీ సుమారు నాలుగు ద్విచక్ర వాహనాలు, కొన్ని కుర్చీలు, రెండు టెంట్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. అంతా చూస్తుండగానే కాలి బూడిదయ్యయాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఫంక్షన్ హాల్లో టపాసులు పేల్చడం మానుకోవాలని సూచించారు. 


రెండ్రోజుల క్రితమే సికింద్రాబాద్ లో అగ్ని ప్రమాదం


సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌లోని ఓ ఇంట్లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. శనివారం రాత్రి (మే 14) ఈ ఘటన జరగ్గా, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద నష్టం తప్పింది. ఈ ప్రమాదంలో చెక్క సామగ్రి కాలి బూడిద కాగా, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్ధలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇంటి యజమానిని శ్రీనివాస్‌గా పోలీసులు గుర్తించారు. ఆయన ఓ ప్రముఖ కంపెనీలో డీజీఎంగా పని చేస్తున్నారు. అదే కంపెనీకి సంబంధించిన గవర్నమెంట్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వ్యాపారం కూడా చేస్తున్నారు. అగ్నిప్రమాద సమయంలో ఆయన ఊళ్లో లేరు.


ఇంట్లో రూ.కోటి నగదు?
అగ్ని ప్రమాదం తర్వాత ఇంట్లోని బెడ్ రూమ్‌లో భారీగా డబ్బులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. తనిఖీల్లో రూ.కోటి 64 లక్షల 45 వేల నగదు, బంగారం, వెండి లభ్యమైనట్లు సమాచారం.