- అవినీతిలో నెంబర్ 1 కల్వకుంట్ల కమీషన్ రావు
- కేసీఆర్‌ను ఫామ్ హౌస్ నుంచి రోడ్ల మీదకు తీసుకొచ్చిన పార్టీ బీజేపీ
- ఏ పథకం రావాలన్నా స్థానిక ఎమ్మెల్యేకు కమీషన్లు తప్పవు
- వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను గద్దె దించుతాం: మాజీ ఎంపీలు


గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడూ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యేవారని, ఆయనను రోడ్డు మీదకు తీసుకొచ్చిన ఘనత బీజేపీదేనని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ దెబ్బకు కేసీఆర్ ఇప్పుడిప్పుడే ప్రజల మధ్యకు వస్తున్నాడని, ఆయనను కచ్చితంగా గద్దె దింపుతాం అన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని, నియంత పాలన, కుటుంబ పాలనతో తెలంగాణ ప్రజలు కష్టాలు పడుతున్నారని, వారి కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుతింటోందని ఆరోపించారు.


హామీలు నెరవేర్చని సీఎం కేసీఆర్..
ఎన్నో హామీలు నెరవేర్చానంటూ సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని వివేక్ వెంకటస్వామి అన్నారు. దేశంలో అవినీతిలో నెంబర్ 1 ఎవరంటే.. కల్వకుంట్ల కమీషన్ రావు అంటూ సెటైర్లు వేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్న కేసీఆర్... ఇచ్చాడా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తనయుడు ట్విట్టర్ టిల్లు చెప్పేవన్నీ అబద్ధాలేనని, ఉద్యోగాలపై ట్విట్టర్ టిల్లు ప్రకటన హాస్యాస్పదంగా ఉందంటూ తెలంగాణ పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


సీఎం కుటుంబం చేసిన అవినీతిపై ప్రశ్నిస్తూ కేసీఆర్‌ను పోయించే నాయకుడు, పులిబిడ్డ బండి సంజయ్ అని మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇక్కడే మూడు రోజుల ఉండి, పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని కేసీఆర్ అన్నారు. పోడు భూముల సమస్య పరిష్కరించినట్లయితే ఇటీవల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హత్య జరగకపోయి ఉండేదన్నారు. కమీషన్‌లు దొరకనిదే ఖానాపూర్ లో ఏ పని జరగదన్నారు. 


టీఆర్ఎస్ నేతల అక్రమాలు అన్నీ ఇన్నీ కావన్నారు. టీఆర్ఎస్ నేతలు అడిగే కమీషన్ లకు కాంట్రాక్టర్లు మారిపోతున్నారని చెప్పారు. సదర్ మాట్ ఆనకట్ట తెగితే,  కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. సొంత కాలేజీలు ఉన్నందున ఇక్కడికి డిగ్రీ కాలేజ్ రాకుండా ఎమ్మెల్యే అడ్డుకుందన్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలన్నా, దళిత బంధు డబ్బులు రావాలన్నా అర్హులైన వారు స్థానిక ఎమ్మెల్యేలకు డబ్బులు సమర్పించక తప్పని పరిస్థితి తెలంగాణలో తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.