నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్


సీఎం కేసీఆర్ నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటనలో భాగంగా జగిత్యాలలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంతోపాటు, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారభించనున్నారు. ఆ తర్వాత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. జిల్లా అధికారులతో సమీక్షా నిర్వహిస్తారు. 


మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్‌ ద్వారా జగిత్యాల జిల్లాకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12.30కు జగిత్యాల జిల్లా సమీకృత అధికారుల కార్యాలయంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 12.40 గంటలకు టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ఒంటి గంటకు జగిత్యాల జిల్లా కేంద్రంలో నూతన మెడికల్‌ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు. 1.15 నిమిషాలకు సమీకృత జిల్లా అధికారుల కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.


అనంతరం జిల్లా అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్షా సమావేశంలో పాల్గొన్న తర్వాత మధ్యాహ్న భోజనం చేయనున్నారు. 3.10కి జగిత్యాల జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న మోతె గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం బహిరంగ సభ ముగిసిన వెంటనే 4.15కు జగిత్యాల నుండి తిరిగి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి తిరిగి వెళ్లనున్నారు.


సిట్‌కు షాకిచ్చిన ఏసీబీ కోర్టు- దర్యాప్తు చేసే అధికారం లేదు, నేడు విచారణ


టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బేరసారాల కేసులో మొయినాబాద్‌ పోలీసులకు చుక్కెదురైంది. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌తో పాటు తుషార్‌, జగ్గు స్వామి, న్యాయవాది శ్రీనివాస్‌లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలంటూ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. గత నెల 22న మొయినాబాద్‌ పోలీసులు కోర్టులో మెమో దాఖలు చేశారు. తుషార్‌, జగ్గుస్వామిలను విచారించడానికి వారెంట్‌ కూడా దాఖలు చేశారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్‌ సంతోష్‌, రామచంద్రభారతి వాట్సాప్‌ సంభాషణ జరిపారని, ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర చేశారని పోలీసుల తరపున ప్రత్యేక పీపీ వాదనలు చేశారు. తెలంగాణలోనే కాకుండా ప్రజలు ఎన్నుకున్న ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, ఏపీలలో ప్రభుత్వాలను కూలగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసుల తరఫు న్యాయవాది ఏసీబీ కోర్టుకు తెలిపారు.


 మెమోపై నిందితుల తరఫు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మెమో ద్వారా నిందితులను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చే ప్రోసీడింగ్‌ లేదని వాదించారు. కేవలం రాజకీయ కక్షతోనే కేసులు నమోదుచేశారని వాదించారు. శ్రీనివాస్‌ తరఫు లాయర్‌ వాదనతో కోర్టు ఏకీభవించింది. మెమోను న్యాయమూర్తి కొట్టివేశారు. మెమో రిజెక్ట్‌ చేయడానికి గల కారణాలను కూడా ఏసీబీ చూపింది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బేరసారాల కేసు దర్యాప్తు చేయడానికి లా అండ్‌ ఆర్డర్‌కు కానీ సిట్‌కు కానీ ఎలాంటి అధికారం లేదని పేర్కొంది. కేవలం ఏసీబీ మాత్రమే ఈ కేస్‌ దర్యాప్తు చేయాలని సూచించింది. లా అండ్‌ ఆర్డర్‌ కానీ, సిట్‌ కానీ ఎటువంటి స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్మెంట్‌ కాదు కాబట్టి వారికి ఈ కేసు దర్యాప్తు చేసే అధికారం లేదని స్పష్టం చేసింది. బీఎల్‌ సంతోష్‌తో పాటు తుషార్‌, న్యాయవాది శ్రీనివాస్‌ను నిందితులుగా పరిగణించలేమని తేల్చి చెప్పింది. ఇవే కారణాలు చూపుతూ సిట్‌ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్ట్‌ రిజెక్ట్‌ చేసింది. 


నేడు రాజ్‌భవన్‌ను ముట్టడించనున్న సీపీఐ


రాజ్యాంగ పదవి గవర్నర్ వ్యవస్థను రద్దుచేయాలని దేశవ్యాప్తంగా ఉద్యమించాలని నిర్ణయించామని సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఇవాళ హైదరాబాద్‌లోని రాజభవన్‌ను ముట్టడిస్తామని ఆయన ప్రకటించారు. రాజకీయ పార్టీల కన్నుసన్నల్లో పనిచేసే గవర్నర్లు రాజ్యాంగేత శక్తులుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ, తమిళనాడు, కేరళలో గవర్నర్ల పనితీరును ప్రస్తావించారు. ప్రభుత్వ విధానాల్లో నిర్ణయం తీసుకునే అధికారం లేకున్నప్పటికీ బిల్లులు ఆమోదించే విషయంలో ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారని ఆయన విచారం వ్యక్తంచేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా తమకు ఇష్టం వచ్చిన వారిని గవర్నర్ పదవుల్లో కూర్చొనిబెడుతున్నారేగానీ, ఒక ప్రామాణికత లేకుండా పోయిందన్నారు. తెలంగాణనుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామని కూనంనేని సాంబశివరావు తెలిపారు.


తెలంగాణలో పోలీసు దేహ దారుడ్య పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి


స్టైఫెండరీ పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ అభ్యర్థులకు రేపటి నుంచి నిర్వహించే దేహదారుఢ్య పరీక్షలకు పోలీసుశాఖ పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 8 నుంచి జనవరి 3 వరకు పోలీసు ఎంపికలకు దేహదారుఢ్య పరీక్షలు జరుగుతాయన్నారు. తెలంగాణలోని ముందే నిర్ణయించిన మైదానాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసు ఉన్నాతాధికారులు ఏర్పాట్లను ఇప్పటికే పర్యవేక్షించారు. 


ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి. 


పోలీసుల నిర్వహించే ఫిజికల్‌ ఈవెంట్స్‌లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి 24,612 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్టు చెప్పారు. వీరిలో పురుషులు 19,651 కాగా, మహిళలు 4,964 మంది ఉన్నారు. ఉదయం 5 గంటల నుంచి ఎంపికల ప్రక్రియ ప్రారంభం అవుతుందని, ప్రతీ రోజు 1,250 మంది చొప్పున ఫిజికల్‌ ఈవెంట్స్‌ నిర్వహిస్తామన్నారు.కాగా, పురుషులకు 8 నుంచి జనవరి 3 వరకు ఈవెంట్లు నిర్వహిస్తుండగా మహిళలకు మాత్రం డిసెంబరు 10 నుంచి 14 వరకు నిర్వహిస్తామని వరంగల్ సీపీ రంగనాధ్ తెలిపారు.


తెలంగాణలో తగ్గుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు


తెలంగాణ లోని అన్ని జిల్లాల్లో అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుతుండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. తెల్లవారుజామున పొగమంచు కురుస్తుండడంతో రోడ్లపై వెళ్తున్న వాహనదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.