బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన ఏడో రోజుకు చేరింది. మెయిన్ గేటు వద్ద విద్యార్థులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. 48 గంటల పాటు జాగరణ దీక్షకు దిగారు. విద్యార్థులతో గత అర్ధరాత్రి కలెక్టర్ జరిపిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఆందోళన విరమించాలని కలెక్టర్ సూచించారు. అయితే మంత్రుల నుంచి లిఖిత పూర్వక హామీ కావాలని విద్యార్థులు పట్టు బట్టారు. విద్యార్థులు వినకపోవడంతో కలెక్టర్ వెళ్లిపోయారు. దీంతో విద్యార్థులు యథావిధిగా తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.
నేడు మంత్రుల వద్దకు ముథోల్ ఎమ్మెల్యే
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ప్రత్యేకంగా కలిసి సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే జి.విట్టల్ రెడ్డి విన్నవించనున్నారు. స్థానికంగా కూడా ఎమ్మెల్యే విట్ఠల్ రెడ్డిపై తీవ్ర ఒత్తిడులు కూడా వస్తున్నాయి. ప్రభుత్వం స్పందించకుంటే బాసర గ్రామస్థులు సైతం వారికి మద్దతు పలికేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.
ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఆదివారం రాత్రి కూడా బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులు తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. ఆదివారం అర్ధరాత్రి నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ, భైంసా ఏఎస్పీ కిరణ్ ఖరేలు ఆర్జీయూకేటీని సందర్శించారు. ప్రధాన ద్వారం వద్ద ఉన్న మీడియాకు తెలియకుండా రెండో గేటు ద్వారా లోపలికి చేరుకున్నారు. అనంతరం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థుల వద్దకు ఆర్జీయూకేటీ డైరెక్టర్ సతీష్ కుమార్ తో కలిసి వెళ్లారు. విద్యార్థులను ఉద్దేశించి సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలంగా ఉందని తెలిపారు. మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి సైతం ఈ విషయమై సుముఖంగా ఉన్నారని వివరించారు. ఇప్పటికే క్యాంపస్ లో విద్యుద్దీకరణ, ప్లంబింగ్ వంటి మరమ్మతు పనులను చేయిస్తున్నట్లు తెలిపారు. మిగతా సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.
మీ నిర్ణయంపై ఎవరైన ఒకరు మాట్లాడమని ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ విషయంపై విద్యార్థులు ముక్తకంఠంతో మంత్రులతో మాట్లాడించాలని స్పష్టం చేశారు. లేదా ట్విటర్‌లో పోస్టు చేయించాలని సూచించారు. అర్ధరాత్రి అలా చేయడం కుదరదు కాబట్టి సోమవారం చేయిస్తామని వివరించారు. అర్ధరాత్రి వచ్చి తమతో చర్చలు జరిపేందుకు లేని ఇబ్బందులు వారితో చెప్పించడానికి ఏమవుతుందని విద్యార్థులు ప్రశ్నించారు.
విద్యార్థుల ఆందోళన
మరోవైపు, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ట్రిపుల్ఐటీ విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. రోజు రోజుకి ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది.