బాసర ట్రిపుల్‌ ఐటీలో అర్ధరాత్రి వేళ కూడా నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులతో ఇటీవలే నియమించిన డైరెక్టర్‌, కలెక్టర్‌ చర్చలు జరిపారు. అయితే వారితో చర్చలు సఫలం కాలేదు. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకూ క్యాంపస్ లోనే విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యార్థుల వద్దకు ఆదివారం రాత్రి ఆర్‌జీయూకేటీ డైరెక్టర్‌ సతీశ్ కుమార్, కలెక్టర్‌ ముష్రాఫ్‌ అలీ వెళ్లి మాట్లాడారు. విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు విద్యార్థులకు చెప్పారు. యూనివర్సిటీలో ఇప్పటికే పాడైన కరెంటు పనులు, నీళ్ల, డ్రైనేజీ పైపు లైను పనులు మరమ్మతులు చేపట్టామని వారు విద్యార్థులకు వివరించారు.


డిమాండ్లకు తగ్గట్లుగా వీసీ నియామకం జరుగుతుందని హామీ ఇచ్చారు. అందుకని ఆందోళన విరమించి హాస్టల్ గదుల్లోకి వెళ్లిపోవాలని చెప్పారు. అయితే, తమ సమస్యలు పరిష్కరించడంపై మంత్రుల నుంచి రాతపూర్వకంగా హామీ ఇప్పిస్తేనే తాము కదులుతామని విద్యార్థులు పట్టుబట్టారు. అయితే, మంత్రులతో అర్ధరాత్రి హామీ ఇప్పించడం కష్టమని కలెక్టర్ వారికి చెప్పారు. అయితే, అర్ధరాత్రి చర్చలు జరుపుతున్నారని, అలాంటిది హామీ ఇవ్వడానికి ఏం ఇబ్బందని విద్యార్థులు ఎదురు ప్రశ్నించారు. 






సత్యాగ్రహ దీక్ష
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు 48 గంటల పాటు జాగరణ దీక్ష చేపడుతున్నారు. విద్యార్థుల 12 డిమాండ్లపై ఇప్పటి వరకు ఒక్క మంత్రి కూడా సరైన హామీ ఇవ్వలేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. జాగన దీక్షలో భాగంగా విద్యార్థులకు ఏమైనా జరిగీతే ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్. 


రాత్రి ప్రెస్ నోట్ విడుదల
బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ (SGC) విద్యార్థులు ఆదివారం రాత్రి ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. తాము పోరాటం మొదలు పెట్టిన నాటి నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్, ముథోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, టీఎస్పీఎస్సీ వైస్ ఛైర్మన్ వెంకటరమణ, ఆర్జీయూకేటీ డైరెక్టర్ సతీశ్ కుమార్ తదితరులు తమతో చర్చలు జరిపారని అవి ఫలదాయకంగా లేవని తెలిపారు. డిమాండ్లకు సంబంధించిన వివరాలను కూడా అందులో పేర్కొన్నారు.