బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) లో విద్యార్థుల నిరసన ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే విద్యార్థులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ వెంకటరామిరెడ్డి చర్చలు జరిపారు. అయితే, విద్యార్థులతో చర్చలు సఫలం అయ్యాయని మంత్రి చెబుతున్నారు. కానీ, ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. వారు చర్చల అనంతరం కూడా అంతకుముందు లాగానే పట్టు విడవకుండా నిరసనలు కొనసాగిస్తున్నారు.
ఆదివారం దీనిపై స్పష్టత
‘‘మేం నిరసనల నుంచి వెనక్కి తగ్గుతున్నట్లుగా కొన్ని గంటలుగా తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇంకా, మాకు కొన్ని అంశాలపై క్లారిటీ రావాలి, దీనికి సంబంధించి ఓ ప్రెస్ నోట్‌ను త్వరలోనే విడుదల చేస్తాం. మేం నిరసన విరమిస్తామని ఓ నిర్ణయానికి రావద్దు’’ అని బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులు ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో ‘‘మన డిమాండ్లు తీరే వరకూ మనమే వేచి ఉండాలి. మేలుకో విద్యార్థి మేలుకో!’’ అంటూ ఇంకో ట్వీట్ చేశారు.
చర్చలు సఫలం అని మంత్రి ప్రకటన
శనివారం విద్యార్థులతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్‌ఛైర్మన్ వెంకటరామిరెడ్డి, జిల్లా కలెక్టర్ చర్చలు జరిపారు. సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పడంతో సోమవారం నుంచి క్లాసులకు హాజరవుతామని విద్యార్థులు ఒప్పుకున్నారని మంత్రి తెలిపారు. సమస్యల పరిష్కారం చేస్తామని ఒప్పుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ట్వీట్లు చేయాలని విద్యార్థులు కోరినట్లు చెప్పారు. వారి కోరిక మేరకు మంత్రులతో ట్వీట్ చేయించేందుకు తాము సరే అన్నామని ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు.
అయితే, క్యాంపస్‌లో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. వర్షంలోనూ విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా (జూన్ 19) వారు ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చారు.
విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నిరసన
మరోవైపు, క్యాంపస్‌లో విద్యార్థులు గత ఆరు రోజులుగా పోరాటం చేస్తుంటే, వారి తల్లిదండ్రులు కూడా మద్దతు తెలుపుతున్నారు. సిద్దిపేటలో ఆదివారం కొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ‘‘సీఎం రావాలి.. వీసీ కావాలి’’ సహా పలు డిమాండ్లను ప్లకార్డులపై ప్రదర్శించి ప్రదర్శించారు.