Trending
Basar IIIT News: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల నిరసనలకి శుభం కార్డు, అర్ధరాత్రి మంత్రితో చర్చలు సఫలం
Basar IIIT Students: అర్ధరాత్రి 12.30 ప్రాంతంలో విద్యార్థులు ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం నుంచి క్లాసులకు హాజరువుతామని ప్రకటించారు.
నిర్మల్ జిల్లాలో బాసర ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) విద్యార్థులు గత 7 రోజులుగా క్యాంపస్‌లో చేస్తున్న నిరసనలకు శుభం కార్డు పడింది. సోమవారం అర్ధరాత్రి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కలెక్టర్ ముషారఫ్ విద్యార్థులతో జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. వర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని, అందుకోసం తక్షణం గ్రాంటు కూడా విడుదల చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించడంతో నిరసనలను విద్యార్థులు విరమించారు. అర్ధరాత్రి 12.30 ప్రాంతంలో విద్యార్థులు ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం నుంచి క్లాసులకు హాజరువుతామని ప్రకటించారు. రాత్రి 9.30 నుంచి రెండున్నర గంటలకుపైగా ఈ చర్చలు జరిగాయి.
మంత్రితో చర్చల అనంతరం బయటకు వచ్చిన విద్యార్థులు అర్ధరాత్రి స్థానిక మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో తాము ఆందోళన విరమిస్తున్నామని తెలిపారు. నెల రోజుల్లో వీసీ నియామకం చేపడతామని మంత్రి చెప్పారని విద్యార్థులు వివరించారు. 12 డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం తరఫున మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారని వివరించారు. తక్షణమే రూ.5.6 కోట్ల నిధులను విడుదల చేస్తామని నిర్మల్ కలెక్టర్ చెప్పినట్లు వివరించారు.
రాత్రి 9.30 గంటలకు ఆర్జీయూకేటీకి వెళ్లిన మంత్రి
సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆర్జీయూకేటీకి వచ్చారు. ఆమె వెంట రాహుల్ బొజ్జా, ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ వెంకట రమణ, ఆర్జీయూకేటీ డైరెక్టర్ సతీష్‌కుమార్, విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం 20 మంది స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ విద్యార్థులను ఆడిటోరియంలోకి పిలిచి చర్చలు ప్రారంభించారు. ఈ చర్చలు 12 గంటల వరకూ సాగాయి.