ఏడు రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్శిటీలో విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. స్టూడెంట్స్ తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోసం సుమారు 8 వేలమంది విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేస్తున్నారు. ఈ విషయంపై  ఇంతవరకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విట్టల్ రావు, జిల్లా కలెక్టర్ చర్చలు జరిపినా సఫలం కాలేదు. 12 డిమాండ్లు అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ లిఖితపూర్వక హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తానని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. 


ఇంతవరకు సీఎం కేసీఆర్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ స్పందించలేదు. అధికారులు, మంత్రులు చెబుతున్న మాటలను విద్యార్థులు విశ్వసించడం లేదు. అయితే విద్యార్థులకు మాత్రం రాజకీయా పార్టీల నుంచి ఫుల్‌ సపోర్ట్ దొరుకుతుంది. ఇప్పుడు లోకల్‌ ప్రజాప్రతినిధులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. 


ట్రిపుల్ ఐటీని కాపాడే బాధ్యత బాసర మండల జెడ్పిటిసి సభ్యురాలిగా తనపై ఉందని అందుకే విద్యార్థులకు మద్దతుగా, వాళ్ల తల్లిదండ్రులకు మద్దతుగా నిలబడతానంటూ వసంత రమేష్‌ చెబుతున్నారు. శాంతియుతంగా బాసర తహసిల్దార్ కార్యాలయం లేదా శివాజీ చౌక్ ఎదుట మంగళవారం నుంచి రిలే నిరాహార దీక్ష చేపడుతున్నట్టు పేర్కొన్నారు. వాళ్ల న్యాయ పరమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంతవరకు రిలే నిరాహారదీక్ష చేస్తానని వెల్లడించారు. దీక్షకు అనుమతి ఇవ్వాలంటూ జిల్లా అడిషనల్‌ ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుతం ధర్నా చేస్తున్న విద్యార్థులతోపాటు భవిష్యత్ తరాల విద్యార్థుల సమస్యను దృష్టిలో ఉంచుకొని వారిపై దయతలచి రిలే నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలని వసంతరమేష్‌ కోరారు. 


తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల మద్దతు


తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు సైతం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మద్దతు తెలుపుతున్నారు. టీయూ స్టూడెంట్స్ కూడా ట్రిపుల్ ఐటీ విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని క్యాంపస్‌లో నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. గత ఏడు రోజులుగా విద్యార్థులు శాంతియుతంగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటంపై నిరసన కార్యక్రమాలు చేస్తామన్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తాము కూడా పోరాటం చేస్తామని తెలిపారు.


విద్యార్థుల డిమాండ్స్ 




 



విద్యార్థులు రెగ్యులర్ వీసీని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలంటున్నారు. ICT ఆధారిత విద్య అందించాలని కోరుతున్నారు.  పీయూసీ బ్లాక్ లు హాస్టళ్ల పునరుద్ధరణ, లైబ్రరీలో బుక్స్ అందుబాటులో ఉంచాలని ఇలా వారికి యూనివర్సిటీలో అవసరమైన వాటినే అడుగుతున్నారు. కనీసం యూనిఫామ్స్ కూడా ఇవ్వలేని దుస్థితిలో యూనివర్సిటీ ఉందంటే విద్యార్థుల ఆవేదనకు అర్థం లేకపోలేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇన్నాళ్లు ఓపిక పట్టిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఓపిక నశించి ఇలా ఏడు రోజులైనా వెనక్కి తగ్గకుండా ఎంత కష్టమైన తమ నిరసనను కొనసాగిస్తున్నారన్నారు. అందుకే సీఎం కేసీఆర్ వచ్చి చూస్తే తమ సమస్యలు అర్థమవుతాయి అనే ఉద్దేశ్యంతో గత ఏడు రోజులుగా ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు వద్దే బైఠాయించి నిరసనలు తెలువుతున్నారు స్టూడెంట్స్. ఇకనైనా ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు విద్యార్థులు, వారి తల్లి దండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు.