Bandi Sanjay Padayatra: ‘‘బీజేపీ నేత బీఎల్ సంతోష్ గొప్ప వ్యక్తి. ఈ దేశం, ధర్మం, సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు కష్టపడి ప్రచారక్ గా పని చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఓర్వలేక ఆయనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నరు. ఆయన పాత్ర లేకపోయినా, ఒక్క పైసా దొరకకపోయినా అవినీతి కేసు ఎట్లా పెడతావంటూ ఏసీబీ కోర్టు కేసీఆర్ చెంప చెళ్లుమన్పించింది. బీజేపీని బదనాం చేసేందుకు కేసీఆర్ చేసే కుట్రలను తిప్పికొడదాం" అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. తెలంగాణ తలదించుకునే దుస్థితికి తీసుకొచ్చారని, ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదని ఆయన అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు పైసల్లేవట అంటూ విమర్శించారు. ప్రజాధనాన్ని లూటీ చేసి లక్ష కోట్లతో దొంగ సారా దందా చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. దేశమంతా కేసీఆర్ కుటుంబాన్ని చూసి అసహ్యించుకుంటోందని తెలిపారు.
లక్ష కోట్లతో దొంగ సారా దందా చేసిన కేసులో అడ్డంగా బుక్కయిన బిడ్డను అరెస్ట్ చేస్తే, తెలంగాణ సెంటిమెంట్ రగిలించి యుద్దం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని అన్నారు. ‘‘కేసీఆర్ యుద్దం స్టార్ట్ చేసిండు.. యుద్దానికి మనం సిద్దమే. కేసులు, రౌడీ షీట్లు, దాడులకు భయపడే ప్రసక్తే లేదు. తెలంగాణ గడ్డపై కాషాయ జెండాను రెపరెపలాడించేదాకా పోరాటాన్ని కొనసాగించి తీరుతాం’’ అని స్పష్టం చేశారు. హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసుల్లో కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని, వెంటనే ఆ కేసులను రీ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఖానాపూర్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, బ్రిడ్జీలను నిర్మిస్తామన్నారు. దీంతోపాటు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు. 10వరోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఈరోజు ఖానాపూర్ పట్టణానికి విచ్చేసిన బండి సంజయ్ కు వేలాది మంది జనం తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. బీజేపీ కార్యకర్తలు బాణాసంచా పేల్చి డ్యాన్సులు చేస్తూ సంబురాలు చేసుకున్నారు.
ముగింపు సభకు తరలిరండి..
ఈనెల 15వ తేదీన కరీంనగర్ లో ముగింపు సభ ఉందని.. జేపీ నడ్డా కూడా వస్తారని బండి సంజయ్ తెలిపారు. ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. సీఎం కేసీఆర్ ఎంతసేపూ బిడ్డ జపమే చేస్తున్నాడని.. ఈనెల 11న బిడ్డ సంగతేంటో తెలుస్తుందన్నారు. ఇవాళ ఖానాపూర్ లోనే 110 రోజులు, 100కి.మీలు, 51 నియోజకవర్గాలు పూర్తయిందన్నారు. కానీ కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ పూర్తి కాలేదన్నారు. సదర్ మ్యాట్, గంగాపురం బ్రిడ్జి, డిగ్రీ కాలేజ్, ఆర్డీఓ కార్యాలయం ఎప్పుడు ఇస్తారని అన్నారు. వీటన్నిటిని ప్రశ్నించడానికే తాను పాదయాత్ర చేస్తున్నట్లు వివరించారు. ప్రజల కష్టాలు, బాధలు తెలుసుకుంటూ... వారికి భరోసా కల్పిస్తున్నామన్నారు. కేసీఆర్ అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుతామన్నారు.
నిర్మల్ లో బండి సంజయ్ ని చూసి, భయపడింది ఎవరో ప్రజలకు తెలుసుంటూ కామెంట్లు చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక, పేదలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు. నిలువ నీడలేని పేదలకు ఇండ్లు కట్టిస్తామన్నారు. అలాగే పంట నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా యోజన పథకాన్ని పూర్తిగా అమలు చేసి, ఆదుకుంటామన్నారు. కేసీఆర్ కు తెల్లారితే చాలు, మోడీ పై ఏడుపే అంటూ ఎద్దేవా చేశారు. 26 మంది బీసీ ఎంపీలు, 12 మంది ఎస్సీ ఎంపీలు, 8 మంది ఎస్టీ ఎంపీలను, కేంద్ర మంత్రులుగా చేసిన ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అని తెలిపారు. కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చాడంటూ ఫైర్ అయ్యారు. మొత్తం రూ.5 లక్షల కోట్లు అప్పు చేశాడని ఆరోపించారు. ఖానాపూర్ ప్రజల జోష్ చూస్తే.. బీజేపీ విజయోత్సవ ర్యాలీలా అనిపిస్తోందని బండి సంజయ్ అన్నారు.