Sanna Biyyam Scheme News Updates | ఆసిఫాబాద్: పేదవాడి కడుపు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుందని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జనకాపూర్ పునరావాస కాలనీలో రేషన్ కార్డు లబ్ధిదారుడు తాక్సండే శంకర్ ఇంట్లో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం.డేవిడ్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, లబ్ధిదారులతో కలిసి ప్రభుత్వం అందించిన సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. లబ్ధిదారుడు తాక్సాండే శంకర్ ఇంట్లో కలెక్టర్ అందరితో కలిసి సాధారణంగా నేలపైనే కూర్చొని భోజనం చేసారు.
ఈ సందర్భంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ.. అర్హత గల ప్రతి పేదవాడికి ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. తద్వారా రేషన్ కార్డుదారులకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా సన్న బియ్యం అందుతాయని అన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ లో ఆదేశించిన ప్రకారంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 314 చౌక ధరల దుకాణాల ద్వారా 3 వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రత్యేక అధికారులు జిల్లాలోని చౌక ధరల దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలిపారు. జిల్లాలో 100 శాతం చౌక ధరల దుకాణాల ద్వారా అర్హత గల లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు.
రేషన్ కార్డు లబ్ధిదారుడు తాక్సండే శంకర్ మాట్లాడుతూ... ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం, జిల్లా కలెక్టర్ తన ఇంట్లో భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇంతకు ముందు కిరాణా దుకాణాలలో సన్న బియ్యం కొనుగోలు చేసేవారని, ఇప్పుడు ఖరీదు చేసే అవసరం లేకుండా ప్రభుత్వం ఉచితంగా సన్న బియ్యం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ రోహిత్ కుమార్, సంబంధిత అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు.
లబ్ధిదారుడి ఇంట్లో భోజనం
అటు మంచిర్యాల జిల్లాలోను కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మేల్యే గడ్డం వివేక్ లబ్ధిదారుడి ఇంట్లో సన్న బియ్యం భోజనం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని కిష్టంపేట గ్రామంలో ప్రజా పంపిణీ ద్వారా పొందిన సన్న బియ్యంతో వండిన వంటతో భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రైతు వండిన వంటను ఆస్వాదించారు.
హామీ ప్రకారం సన్న బియ్యం పంపిణీ
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుందని అన్నారు. ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా సన్న బియ్యం పంపిణీ కొనసాగుతుందన్నారు. గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యంతో రేషన్ దందా నడిచేదని మొత్తం రేషన్ మాఫియా తయారైందని ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా పేదలకు సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. రైతు వండిన భోజనం చాలా రుచికరంగా ఉందన్నారు సన్న బియ్యంతో నిరుచి చాలా బాగుందన్నారు.
ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం ఎంతో బాగున్నాయని సన్న బియ్యం తయారు చేసిన భోజనం చాలా బాగుందన్నారు. లబ్ధిదారులు ప్రసన్న బియ్యాన్ని తమ తిండి అవసరాల కోసం వినియోగించుకోవాలని సూచించారు.