3 నెలల కిందట బాల్కొండ నియోజకవర్గం బుస్సాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదిస్తున్నారు. అయితే బ్యాంకులో రుణం కోసం పెట్టిన మొత్తం బంగారాన్ని వెంటనే ఇవ్వాలని ఇప్పటికే బాధితులు ఆందోళనకు దిగుతున్నారు. నిత్యం బ్యాంకు ఎదుట తమ బంగారం తమకు ఇవ్వాలంటూ బాధితులు నిరసనలు తీవ్రతరం చేశారు. సోమవారం రుణ గ్రహీతలు బ్యాంకు అధికారులతో వాగ్వాదానికి దిగారు. గత జూలైలో బ్యాంకులో భారీ దోపిడీ జరగడంతో రుణాల కోసం కుదువపెట్టిన 8 కిలోల బంగారం చోరీ అయిన విషయం తెలిసిందే. అయితే బంగారాన్ని తరుగు తీసి ఇస్తామని బ్యాంకు అధికారులు ప్రకటించారు. రుణగ్రహితలు మాత్రం కుదువ పెట్టిన తమ మొత్తం బంగారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 

తరుగు పేరిట తక్కువ ఎలా ఇస్తారని బ్యాంకు అధికారులను నిలదీస్తున్నారు.

 

సికింద్రాబాద్ లో నిందితున్ని పట్టుకున్న పోలీసులు

మరోవైపు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో జరిగిన చోరీ కేసులో పోలీసులు ఒకరిని అరెస్టు చేసినట్లు సీపీ నాగరాజు తెలిపారు. బ్యాంక్ దొంగతనం కేసులో మూడో నిందితుడిగా ఉన్న రాజును సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర అదుపులోకి తీసు కున్నట్లు తెలిపారు. ఆర్మూర్ రూర ల్ సీఐ గోవర్దన్ రెడ్డి టీం సికింద్రాబాద్ వెళ్లి అనుమానాస్పదంగా తిరుగుతున్న రాజును పట్టుకొని విచారించగా.... మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామీణ బ్యాంక్ దొంగతనంలో నిందితుడిగా గుర్తించినట్లు చెప్పారు. రాజు నుంచి 10 తులాల బంగారం స్వాధీనం చేసు కున్నారు పోలీసులు. బ్యాంక్ లో చోరీకి పాల్పడిన దొంగలు ఉత్తర్ ప్రదేశ్ లోని బదౌ, బరేలి, కక్రా జిల్లాలకు చెందిన వారుగా గుర్తించినట్లు సీపీ తెలిపారు. ఈ గ్యాంగ్ తమిళనాడులోని కృష్ణగిరి, కర్ణాటకలోని గుల్బర్గా, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని దమ్ముగూడెంతో పాటు కరీంనగర్ జిల్లా లోని మంతెన, కొమురంభీం జిల్లాలోని ఆసిఫా బాద్ బ్యాంక్ దోపిడీలు చేసి.... భారీగా బంగారం దొంగిలించారని తెలిపారు.

 

మరోవైపు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ దొంగతనం కేసులో రాజును పోలీసులు అరెస్ట్ చేయగా మరో 18 మంది పరారీలో ఉన్నట్లు సీపీ నాగరాజు తెలిపారు. ప్రధాన నిందితులు షారుఖ్ ఖాన్, ఫాహీన్ అహ్మద్ తో పాటు సిద్దిఖ్ ఖాన్, యూసుఫ్ ఖాన్, నయీం ఖాన్ అలియాస్ గోరా, తుకీర్, మిరాజ్, సలీం, గుడ్లు, ఇర్ఫాన్ అలియాస్ జియాఖాన్, జుగ్ను, పర్వేజ్, సబ్లో, మునీష్, హఫీఫా, ఆగాఖాన్, ఫర్దీన్ అలి యాస్ చుక్ను, రాజారాంలు ఉన్నట్లు తెలిపారు. వీరు ఉత్తర్ ప్రదేశ్ లోని బద్దె, కక్రా, బరేలీ జిల్లాకు చెందిన వారీగా గుర్తించారు. అయితే జూలైలో బ్యాంకు రాబరీ అయ్యింది. పోలీసులు నిందితులను మరింత త్వరగా పట్టుకుని తమకు న్యాయం చేయాలని బంగారం కోల్పోయిన బాధితులు కోరుతున్నారు. మరోవైపు బ్యాంకు అధికారులు కుదువ పెట్టిన బంగారం చోరీ కావటంతో తరుగు తీసి బంగారాన్ని ఇస్తామనడం సరైంది కాదని, తాము కుదువ పెట్టిన మొత్తం బంగారం ఇవ్వాల్సిందే అంటున్నారు రుణాలు తీసుకున్నవారు.