Adilabad News: అంతరించిపోతున్న తమ జాతికి ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుంటే అటవీ శాఖ నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకుంటుందని ఆదిమ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తన్నారు. సంయమనముతో ఉన్న తమను ఇబ్బందులకు గురి చేస్తే అటవీశాఖ అధికారులపై తిరగబడతామని కోలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సోనేరావు ఉట్నూర్ మండల అధ్యక్షులు సిడాం బాపూరావు హెచ్చరించారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని కుమ్మరికుంట గ్రామంలో చుట్టూ ప్రక్కల ఉన్న కోలాం గ్రామస్తులతో సమావేశమై మాట్లాడారు. అనంతరం ఉట్నూర్ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ మన్ పథకం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుంటే అటవీశాఖ అధికారులు కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో తమ గ్రామాలు ఉన్నందున తమ గ్రామాల్లో ఇండ్లు నిర్మించుకోవడానికి వీలు లేదంటూ అడ్డంకులు చెబుతున్నారని వాపోయారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని బీర్సాయిపేట కోలాంగూడ, జీయర్ నగర్, జెండా గుడా, చెరువుగూడ, కుమ్మరికుంట, మొర్రిపేట్, నాగపూర్, దంతన్ పల్లి కొలాంగూడ, సోనాపూర్, రాజులగూడ, రాజుల మడుగు, ఎర్రగుట్ట, మాణిగూడ, శాంతాపూర్, ధర్మాజీపేట తదితర గ్రామాలలో కొలాం ఆదివాసి గిరిజనులు అనాదిగా నివసిస్తున్నారన్నారు. గతంలోనూ ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలోనూ, చంద్రబాబు హయాంలోనూ, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోనూ పలువురికి ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వం నిర్మించిందని, ప్రస్తుతం మరికొందరికి ఇళ్లు లేనీ వారికి తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం సహకారంతో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేసిందన్నారు. అయితే తమకు ఇండ్లు నిర్మించుకోవడానికి అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారులని, తమకు ఎలాంటి అడ్డంకులు చెప్పవద్దంటూ ఎంపీ, ఎమ్మెల్యేలతోపాటు, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, జిల్లా అటవీ శాఖ అధికారులకీ వినతి పత్రాలు సమర్పించడం జరిగిందని.. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తమ ఆందోళన కార్యక్రమాన్ని ఉదృతం చేస్తామని అన్నారు.
తమ ఇండ్లు నిర్మించకుండా అడ్డుకుంటున్న అటవీ శాఖ అధికారులను తమ గ్రామాలలోకి కూడా రానీయబోమని హెచ్చరించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులతోపాటు ప్రభుత్వం వెంటనే స్పందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసేలా కొలాం ఆదివాసి గిరిజనులకు సహకరించాలన్నారు. లేని పక్షంలో తిరుగుబాటు తప్పదన్నారు. ఈ సమావేశంలో ఆయా గ్రామాల పటేళ్లు టేకం చిన్ను, మడావి మాణిక్ రావు, కొడప మారుతి, ఆత్రం ముకుందరావు, కొడప సోము, కొడప రాజు, టెకం భీంరావు, స్థానిక కోలాం ఆదివాసీ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.