Telangana Congress : కేంద్రం ప్రవేశ పెట్టిన కొత్త ఉపాధి హామీ పథకం బిల్లుపై కాంగ్రెస్ భగ్గుమంది. పథకం పేరు నుంచి మహాత్మ గాంధీ పేరును తొలగించడంపై మండిపడుతోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఆఫీస్‌లను ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. నేరుగా కీలక కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. దీనికి కౌంటర్‌గా గాంధీభవన్‌ను బీజేపీ నేతలు ముట్టడించేందుకు యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది.
ఆదిలాబాద్ నుంచి ఇటు మహబూబ్‌నగర్, ఖమ్మం వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీస్‌లను కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. ఉపాధి హామీ పథకానికి ఉన్న గాంధీ పేరును తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేశారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహాత్మ గాంధీజీ పేరును చెరిపేయాలని ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని నేతలు ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ నేతలు చేస్తున్న నిరసనలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు కూడా నిరసనలు చేపట్టారు. పలు జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలకు రక్షణగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నిలబడ్డాయి. దీంతో పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నల్గొండలో తమ కార్యాలయం ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులపై బీజేపీ శ్రేణులు దాడికి యత్నించడం పరిస్థితిని వేడెక్కించింది. అయితే పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపేశారు. ఇలాంటి ఘటనలు తెలంగాణలోని దాదాపు అన్నిజిల్లా కేంద్రాల్లో కనిపించాయి.
హైదరాబాద్‌లో అయితే కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్లేందుకు చూస్తే కొంత మంది బీజేపీ కార్యకర్తలు గాంధీభవన్ ముట్టడికి యత్నించారు. గాంధీభవన్ నుంచి నేరుగా బీజేపీ ఆఫీస్‌కు వెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు ట్రై చేశాయి. దీన్ని గ్రహించిన బీజేపీ శ్రేణులు ముందే అక్కడకు చేరుకున్నాయి. అటు వాళ్లు ఇరు రాకుండా ఇటు ఉన్న బీజేపీ వాళ్లు అటు వెళ్లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. గాంధీభవన్ గేట్లను మూసివేశారు. అక్కడి నుంచి అందర్నీ తరలించేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో చాలా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ అయ్యింది.