ISIS Terrorist Sajid Akram: ప్రశాంతంగా ఉన్న ఆస్ట్రేలియా తీరాన్ని రక్తసిక్తం చేసిన బాండీ బీచ్‌ కాల్పుల ఘటన, ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. హనుక్కా వేడుకల కోసం వందల మంది యూదు కుటుంబాలు అక్కడికి చేరుకున్న సమయంలో తండ్రీ కొడుకులైన ఇద్దరు వ్యక్తులు ఈ సామూహిక కాల్పుల ఘటనకు పాల్పడ్డారని వెలుగులోకి వచ్చింది. ఈ విధ్వంసం వెనుక ఉన్న ఐసిస్ ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌కు హైదరాబాద్‌తో బలమైన బంధాలు ఉన్నాయని, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 

Continues below advertisement

రెండు పెళ్లిళ్లు, స్టూడెంట్‌ వీసా నుంచి ఉగ్రవాదం వరకు...

యూదులపై కాల్పులు జరిపిన ఐసిస్ ఉగ్రవాది సాజిద్ అక్రమ్‌, తన జీవితకాలంలో రెండుసార్లు వివాహం చేసుకున్నట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. సాజిద్‌ అక్రమ్‌ 1998 నవంబర్‌లో స్టూడెంట్‌ వీసాతో ఆస్ట్రేలియా దేశానికి వెళ్లాడు. అక్కడ కేవలం ఒక సంవత్సరం తిరగక ముందే 1999లో ఒక యూరోపియన్ మహిళ అయిన వెనెరా గ్రోసోని వివాహం చేసుకున్నాడు. మొదట ఆస్ట్రేలియాలో అమలులో ఉన్న సాధారణ పద్ధతిలో పెళ్లి చేసుకున్న ఈ జంట ఆ తర్వాత ఏడాది 2000లో హైదరాబాద్ చేరుకుంది. ఇక్కడ సాజిద్ తల్లిదండ్రుల సమక్షంలో మళ్ల నిఖా చేసుకున్నాడు. 

వీరికి 2001 ఆగస్టు 12న నవీద్ జన్మించాడు. ఉగ్రవాద బాట పట్టిన సాజిద్‌, భవిష్యత్‌లో నవీద్ ఎదుర్కోబోయే పరిణామాలను ముందే ఊహించాడని అంటున్నారు. ఈ క్రమంలోనే సాజిద్‌ తన ఆస్తిపాస్తుల్లో ఉన్న వాటాలను గత ఏడాది ఫిబ్రవరి వెనెరాకు బదిలీ చేసినట్టు సమాచారం. 

Continues below advertisement

కొడుకు నవీద్‌ పాత్ర- 59 నేరాల అభియోగాలు 

బాండీ బీచ్ మారణ హోమంలో పాల్గొన్న తండ్రీ కొడుకుల్లో సాజిద్‌ పోలీసుల కాల్పుల్లో స్పాట్‌లోనే మరణించగా, అతని కొడుకు నవీ్‌ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 24ఏళ్ల నవీద్‌ అక్రమ్‌ను పోలీసులు ఆసుపత్రిలోనే అరెస్టు చేశారు. ఇతనిపై న్యూ సౌత్‌వేల్స్‌ పరిధిలోని బాండీ బీచ్ పోలీసులు మొత్తం 59 నేరాలకు పాల్పడినట్టు అభియోగాలు మోపారు. వీటిలో 15 హత్యలు, ఒక ఉగ్రవాద చర్యకు సంబంధించినవీ ఉన్నట్టు తెలుస్తోంది. 

నవీద్‌ తల్లిదండ్రులతో కలిసి తన 15వ ఏట హైదరాబాద్ వచ్చాడు. అప్పట్లో కొద్ది రోజులు టోలిచౌకీలో ఉండి, దూద్‌బౌలీలో ఆస్తులు విక్రయించ తిరిగి వెళ్లినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. నవీద్‌ 2019లో సిడ్నీలోని అల్‌ మురాద్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి అరబిక్‌ నేర్చుకున్నాడు. అక్కడే పరిచయమైన వారి ద్వారా ఐసిస్‌లో చేరాడా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. 

ఉగ్ర శిక్షణ- బీచ్‌ దాడి వ్యూహం 

సాజిద్,నవీద్‌ ఫిలిప్పీన్స్‌లో ఉన్న మిండానావో ఐలాంద్‌లోని ఐసిస్‌ శిబిరంలో శిక్షణ తీసుకున్నట్టు ఆస్ట్రేలియా పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిలిప్పీన్స్‌ నుంచి వచ్చినప్పటి నుంచి గత ఆదివారం వరకు వీరి కదలికలను పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి ఆస్ట్రేలియా ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ దాడికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. ఆదివారం ఉదయం వీళ్లు దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించి బీచ్‌ వద్దకు చేరుకున్నారు. సాజిద్‌, నవీద్‌లు వినియోగించిన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాజిద్ కారులో ఆరు తుపాకులు, రెండు ఐసిస్ జెండాలను కూడా గుర్తించారు. ఈ దాడిలో ముగ్గురు భారతీయ విద్యార్థులు గాయపడ్డారు. 

తండ్రీ కొడుకులైన సాజిద్, నవీద్‌ పక్కా ప్రణాళికతో యూదులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి, పలువురిని పొట్టన బెట్టుకున్న ఈ ఘటన ఉగ్రవాద తీవ్రతను తెలియజేస్తోంది. అందులో దీనికి హైదరాబాద్‌లో సంబంధాలు ఉండటం ఇక్కడి వారిని కూడా ఇబ్బందుల్లో పడేస్తోంది. దీంతో తెలంగాణ పోలీసులు, ఇతర ఏజెన్సీలు అలర్ట్ అయ్యాయి.