Jewish Historical Festivals | ప్రపంచంలో ప్రతి దేశ ప్రజలు పండుగ రోజును సంతోషంగా గడుపుకుంటారు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు మాత్రం పండుగ జరుపుకోవాలంటే భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. గత కొన్నేళ్లుగా యూదులపై జరుగుతున్న దాడి ఉదంతాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఇలా గతంలో జరిగిన దాడులు ఓవైపు యూదు ప్రజల జ్ఞాపకాల్లో ఇంకా సజీవంగా ఉన్నప్పుడే, తాజాగా ఆస్ట్రేలియాలో హనుక్కా పండుగ జరుపుకుంటున్న యూదులపై ఇద్దరు ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా కాల్పులు జరిపారు. ఇలా గతంలోనూ యూదుల పండుగల సందర్భంగా జరిగిన దాడుల వివరాలను ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

Continues below advertisement

1. హనుక్కా పండుగ రోజు విషాదం

యూదులు జరుపుకునే పండుగల్లో హనుక్కా ఒకటి. హీబ్రూ భాషలో హనుక్కా అంటే 'ప్రతిష్టించడం' (Dedication). దీనిని 'వెలుగుల పండుగ' (Festival of Lights) అని కూడా పిలుస్తారు. యూదులు జరుపుకునే ప్రతి పండుగ వెనుక ఓ చారిత్రాత్మక నేపథ్యం ఉంటుంది. హనుక్కా పండుగ వెనుక చరిత్ర పరిశీలిస్తే.. క్రీస్తుపూర్వం 167లో సిరియన్-గ్రీకు రాజయిన యాంటియోకస్ IV జెరూసలేంలోని యూదుల దేవాలయాన్ని అపవిత్రం చేయడం జరుగుతుంది. దీనిపై ఆగ్రహించిన 'మక్కబీయులు' అనే చిన్న యూదు సైన్యం తిరుగుబాటు చేసి, ఆ మహా సామ్రాజ్య సైన్యాన్ని ఓడించి జెరూసలేం దేవాలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటుంది.

Continues below advertisement

విజయం తర్వాత దేవాలయంలోని పవిత్ర దీపస్తంభాన్ని (మెనోరా) వెలిగించడానికి కేవలం ఒక రోజుకు సరిపడా నూనె మాత్రమే వారి వద్ద ఉంటుంది. కానీ, ఆశ్చర్యకరంగా ఆ దీపం వరుసగా 8 రోజుల పాటు వెలుగుతూనే ఉంది. ఈ అద్భుతాన్ని స్మరిస్తూ యూదులు ఎనిమిది రోజుల పాటు హనుక్కాను జరుపుకుంటారు. అయితే ఆస్ట్రేలియాలోని యూదులు ఈ హనుక్కా పండుగను 2025 డిసెంబర్ 14న, సిడ్నీలోని బోండి బీచ్ వద్ద జరుపుకుంటున్న సమయంలో యూదు సమాజంపై ఘోరమైన ఉగ్రదాడి జరిగింది. ఆర్చర్ పార్క్‌లో సుమారు వెయ్యి మంది భక్తులు దీపాలు వెలిగిస్తున్న సమయంలో, హైదరాబాద్‌ సంతతికి చెందిన సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ అక్రమ్ విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 15 మంది మరణించారు, 40 మందికి పైగా గాయపడ్డారు. పండుగ పూట వెలుగులు నింపాల్సిన చోట మృత్యువు చాలా మంది జీవితాలలో చీకటిని నింపడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది ఇస్లామిక్ స్టేట్ (ISIS) ప్రేరేపిత దాడి అని ప్రాథమిక విచారణలో తేలింది.

2. సిమ్హత్ తోరా పండుగ వేళ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి

సరిగ్గా యూదులు సంతోషంగా పండుగలు జరుపుకునే రోజే ఉగ్రవాదులకు దాడి చేసే లక్ష్యంగా మారింది. ఇదే వ్యూహాన్ని వారు తరచూ అమలు చేస్తున్నారు. 2023 అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడి దీనికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అప్పుడు యూదుల పవిత్రమైన 'సిమ్హత్ తోరా' (Simchat Torah), 'షెమిని అట్జెరెట్' వేడుకలు జరుగుతున్నాయి. సిమ్హత్ తోరా, షెమిని అట్జెరెట్ అనేవి యూదుల క్యాలెండర్‌లో అత్యంత ఆనందకరమైన పండుగలు. ఇవి ఒకటి తర్వాత ఒకటి వెంటనే వచ్చే పండుగలు. షెమిని అట్జెరెట్ అంటే "ఎనిమిదవ రోజు సభ". యూదులు 'సుక్కోత్' (Sukkot) అనే పంటల పండుగను ఏడు రోజుల పాటు జరుపుకుంటారు. ఆ ఏడు రోజులు ముగిసిన వెంటనే వచ్చే ఎనిమిదవ రోజే ఈ 'షెమిని అట్జెరెట్'.

ఇక ఈ పండుగ విశేషం ఏంటంటే.. దేవుడు తన భక్తులతో మరికొంత సమయం గడపాలని కోరుకుంటూ ఏర్పాటు చేసిన ప్రత్యేక దినంగా దీనిని భావిస్తారు. ఈ రోజున ప్రత్యేకంగా వర్షం పడాలని ప్రార్థనలు చేస్తారు. సిమ్హత్ తోరా అంటే "ధర్మశాస్త్రం పట్ల ఆనందం". ఇది పండుగలలోకెల్లా అత్యంత ఉత్సాహభరితమైనది. యూదుల పవిత్ర గ్రంథం అయిన 'తోరా' (Torah)ను ప్రతి వారం కొంత చొప్పున ఏడాది పొడవునా చదువుతారు. సరిగ్గా ఈ రోజున తోరాలోని చివరి అధ్యాయం పఠనం పూర్తవుతుంది. పఠనం పూర్తి కావడమే కాకుండా, వెంటనే మళ్ళీ మొదటి అధ్యాయం (సృష్టి ఆరంభం) నుండి చదవడం ప్రారంభిస్తారు. అంటే దేవుని వాక్యానికి ముగింపు లేదని, అది ఒక నిరంతర చక్రమని చెప్పడం దీని ఉద్దేశం. ఇజ్రాయెల్ ప్రజలు ఈ సందర్భంగా ప్రార్థనల్లో, వేడుకల్లో ఉన్న సమయంలో హమాస్ సరిహద్దులు దాటి వచ్చి 1,200 మందిని పైగా ఊచకోత కోసింది. ఆస్ట్రేలియాలో జరిగిన హనుక్కా దాడి వలెనే, ఇది కూడా ప్రజలు అత్యంత ఆనందంగా ఉండే పండుగ రోజునే జరగడం గమనార్హం. ఈ ఘోర దాడిలో సుమారు 1,200 మందికి పైగా చనిపోగా, 251 మందిని హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.

3. 2002లో జరిగిన పాసోవర్ పండుగలో ఆత్మాహుతి దాడి

ఇజ్రాయెల్ ప్రజలు జరుపుకునే పండుగలలో 'పాసోవర్' (Passover) పండుగ అత్యంత ప్రాముఖ్యమైనది. యూద ప్రజల పూర్వీకులు ఈజిప్టులో వందల సంవత్సరాలు బానిసలుగా ఉండి, అక్కడి నుండి మోషే అనే ప్రవక్త నాయకత్వంలో బానిసత్వం నుండి విముక్తి పొందుతారు. దీనికి గుర్తుగా చేసుకునే పండుగే పాసోవర్ పండుగ. ఇది యూదుల విముక్తికి గుర్తుగా జరుపుకునే పెద్ద పండుగ. 2002 మార్చి 27న నెతన్యా నగరంలోని ఒక హోటల్‌లో యూదులు పండుగ భోజనం (Seder) చేస్తున్న సమయంలో ఒక ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో 30 మంది చనిపోగా, 140 మందికి పైగా గాయపడ్డారు. దీనిని 'పాసోవర్ మసాకర్' అని పిలుస్తారు. ఈ పండుగలో జరిగిన దాడి అత్యంత విషాదకరంగా మారింది.

4. పండుగ రోజే యోమ్ కిప్పుర్ యుద్ధం

ఇజ్రాయెల్ పై ఉగ్రదాడులకు పండుగలే లక్ష్యం అయినట్లు మనం పై చరిత్ర చూస్తే అర్థం అవుతుంది. అయితే ఇలాంటి పండుగ రోజే ఏకంగా వారి శత్రు దేశాలు యుద్ధానికి దిగిన సందర్భం యూదు చరిత్రలో లేకపోలేదు. 1973లో జరిగిన యోమ్ కిప్పుర్ యుద్ధం ఇజ్రాయెల్ చరిత్రలో అత్యంత ప్రసిద్ధమైన, భయంకరమైన యుద్ధంగా చెప్పవచ్చు. 'యోమ్ కిప్పుర్' (Yom Kippur) అనేది యూదుల క్యాలెండర్‌లో అత్యంత పవిత్రమైన రోజు (ప్రాయశ్చిత్త దినం). యోమ్ కిప్పుర్ చరిత్ర మోషే (Moses) కాలం నాటిది. ఇజ్రాయెలీయులు ఈజిప్టు దేశంలో బానిసలుగా ఉండి, ఆ తర్వాత మోషే నాయకత్వంలో విడిపింపబడటం జరుగుతుంది. ఆ సమయంలో మోషే సీనాయి పర్వతంపై వారి ఆరాధ్య దేవుడైన యావే నుండి పది ఆజ్ఞలు తీసుకోవడానికి వెళ్తాడు. ఆ సమయంలో ప్రజలు దేవుడిని మరిచిపోయి 'బంగారు దూడ' విగ్రహాన్ని తయారు చేసి పూజిస్తారు. ఇది ఘోరమైన పాపంగా పరిగణించబడింది.

మోషే ప్రజల తరపున దేవుడిని క్షమించమని వేడుకుంటాడు. మోషే రెండోసారి పర్వతం దిగి వచ్చి, దేవుడు ఇజ్రాయెలీయులను క్షమించాడని ప్రకటించిన రోజే 'యోమ్ కిప్పుర్'. పూర్వ కాలంలో జెరూసలేం దేవాలయంలో ప్రధాన అర్చకుడు (High Priest) ఇదే రోజున మాత్రమే జెరూసలేం దేవాలయంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశంలోకి (Holy of Holies) వెళ్లి, ప్రజలందరి పాపాల కోసం బలి అర్పించి క్షమాపణ కోరేవాడు. ఈ రోజున ఇజ్రాయెల్ దేశం అంతా స్తంభించిపోతుంది. దేశ ప్రజలంతా ఉపవాసం ఉంటారు.

25 గంటల పాటు కనీసం మంచినీరు కూడా తాగకుండా ఉపవాసం పాటిస్తారు. రవాణా వ్యవస్థ మొత్తం ఆగిపోతుంది. ఈ పరిస్థితుల్లో అక్టోబర్ 6, 1973న ఈజిప్ట్ మరియు సిరియా దేశాలు ఒక్కసారిగా ఇజ్రాయెల్ పై దాడి చేశాయి. ఇజ్రాయెల్ సైన్యం పండుగ మూడ్‌లో ఉండటం వల్ల మొదట భారీ నష్టాన్ని చవిచూసింది. ఈ యుద్ధం దాదాపు 20 రోజుల పాటు కొనసాగింది. ఈ యుద్ధంలో చివరకు ఇజ్రాయెల్ గెలిచింది; సిరియా, ఈజిప్టు దేశాల భూభాగాలను కూడా ఆక్రమించింది. అయితే ఈ యుద్ధం పండుగ రోజే ప్రారంభం కావడం విశేషంగా చెప్పవచ్చు.

ఇలా యూదుల పండుగలు వారికి సంతోషం కన్నా ఎక్కువ విషాదాన్నే నింపుతున్నాయి. అందుకే పండుగ సమయం వచ్చిందంటే యూదు ప్రజలు ఒకింత ఆందోళన చెందుతున్నారు.