BRS Chief KCR: కాంగ్రెస్ పాలనకు రెండేళ్లు పూర్తవుతున్నాయి. కాంగ్రెస్ పాలన తీరుపైన, ప్రజా సమస్యలపైన బీఆర్ఎస్ క్షేత్ర స్థాయిలో పోరాటాలు చేస్తున్నా, ఆ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం రాజకీయ మౌనం పాటిస్తున్నారు. అయితే ఈ నెల 21వ తేదీన జరిగే బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం, ఎల్పీ, పార్లమెంట్ సభ్యుల సమావేశంతో కేసీఆర్ రాజకీయ మౌనం విరమిస్తారన్న ప్రచారం గులాబీ పార్టీలో సాగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు కారు పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ సమావేశంలో ఏం జరగనుందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
మరో జల ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారా..?
ఈ నెల 21వ తేదీన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఇందులో పార్టీ కార్యవర్గ సభ్యులతోపాటు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొననున్నారు. గులాబీ బాస్ కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో రెండేళ్ల కాంగ్రెస్ పాలన తీరు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు తీరుతెన్నులపైన ప్రధానంగా చర్చ జరగనుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు, సర్పంచ్ ఎన్నికల ఫలితాల పైన సమీక్ష జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు ప్రధానంగా నదీ జలాల అంశాలపై ఓ కార్యాచరణకు కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నట్లు తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి.
1. కృష్ణా జలాల వివాదం - కార్యాచరణ
కృష్ణా నదీ జలాల నిర్వహణను KRMB (Krishna River Management Board) కు తెలంగాణ ప్రభుత్వం అప్పగించిందని, రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి తాకట్టు పెట్టిందని గులాబీ బాస్ కేసీఆర్ చెబుతున్నట్లు పార్టీ ముఖ్య నేతలు అంటున్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్న వ్యూహంతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
2. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు జాప్యంపై సర్కార్‌పై ఒత్తిడి
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు దాదాపు 90 శాతం పూర్తి చేసినట్లు గులాబీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు వరప్రదాయిని అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో జాప్యం జరుగుతుందన్నది బీఆర్ఎస్ నేతల ఆరోపణ. పది శాతం పనులను పూర్తి చేస్తే ఆ క్రెడిట్ కేసీఆర్‌కు దక్కుతుందన్న కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందన్నది బీఆర్ఎస్ లీడర్ల వాదన. దీంతో పాటు ఈ ప్రాజెక్టు కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం 90 TMCల కేటాయింపుల కోసం పోరాడితే, ప్రస్తుత ప్రభుత్వం కేవలం 45 TMCలకే అంగీకరించిందని విమర్శిస్తున్నారు. ఈ నిర్ణయం తెలంగాణకు తీవ్రంగా అన్యాయం చేసే చర్యగా అభివర్ణిస్తున్నారు. ఈ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నట్లు ఆయనకు సన్నిహితంగా ఉండే నేతలు చెబుతున్నారు.
3. నల్లమల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళం
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన పోలవరం - నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై కేసీఆర్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించే ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు, ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నది కేసీఆర్ భావన. దీనిని అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడుతూ, న్యాయపోరాటంతో పాటు ప్రత్యక్ష పోరాటాలకు కూడా పిలుపునిచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
భారీ బహిరంగ సభ, క్షేత్ర స్థాయి కార్యాచరణకు పిలుపు
నదీ జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను పెద్ద ఎత్తున ప్రజల ముందు పెట్టాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగా "తెలంగాణ సమాజం మళ్లీ మేల్కొనాలి" అనే నినాదంతో మరోసారి జల ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ అంశాలపై కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి వంటి నేతలతో ఫాం హౌస్‌లో చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రజా ఉద్యమంగా దీన్ని తీసుకెళ్లడం ద్వారా తెలంగాణ ప్రజల్లో మరోసారి చైతన్యం వస్తుందని, దీంతో పాటు గత కొద్ది కాలంగా స్తబ్ధుగా ఉన్న పార్టీ శ్రేణుల్లో మునుపటి ఉత్సాహం వస్తుందన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ అంశాలపై మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. అదే రీతిలో నల్గొండలో కూడా బహిరంగ సభ పెడితే ఎలా ఉంటుందన్న చర్చ సాగినట్లు నేతలు చెబుతున్నారు. జిల్లాల వారీగా పర్యటనలు చేపట్టాలా, లేదా భారీ బహిరంగ సభ నిర్వహించాలా అన్న చర్చ ప్రస్తుతం సాగుతోంది. అవసరమైతే ఢిల్లీలో తెలంగాణ నీటి వాటా కోసం నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాలన్న దిశగా ఆలోచనలు సాగుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఈ నెల 21వ తేదీన జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో గులాబీ బాస్ కేసీఆర్ పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.