కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక శక్తులన్ని ఒక్కటవ్వాలి- ప్రకాష్ అంబేద్కర్ పిలుపు
రాజ్యాంగం రక్షించబడాలంటే బిజెపిని గద్దే దించాలి : ప్రకాష్ అంబేద్కర్
ఆదిలాబాద్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ ను ఓడిస్తేనే రాజ్యాంగానికి రక్షణ ఉంటుందని, ఇందుకోసం ప్రభుత్వ వ్యతిరేక శక్తులన్ని ఒక్కటవ్వాల్సిన ఆవశ్యకత ఉందని వంచిత్ బహుజన్ అగాడి (VBA) జాతీయ అధ్యక్షుడు, అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక రాంలీలా మైదానంలో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా ప్రకాశ్ అంబేద్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్పాటు చేసిన సభలో ఆయన బాబా సాహెబ్ చిత్రాపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. అంతకుముందు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సభకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి అంబేద్కర్ వాదులు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 


దళిత, ఆదివాసీ వర్గాల అభ్యున్నతి కోసం ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించడం పాలకులకు కేవలం కాలక్షేపంగా మారిందని, నిర్ణయాలు తీసుకోవడం, అమలు పర్చడం ఉండదని ఈ సందర్భంగా అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు. ప్రశ్నించే గొంతుకలపై ఈడీ, సీబీఐ దాడులు పరిపాటిగా మారాయన్నారు. రాజ్యంగబద్దంగా పనిచేయాల్సిన దర్యాప్తు సంస్థలను వ్యతిరేక శక్తులపై ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. 'అయితే మాతో కలిసి రండి... లేకుంటే మీపై దాడులే' అన్నట్లుగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ల ద్వయం తయారైందని ఆక్షేపించారు. బీజేపీ వ్యతిరేక శక్తుల ఏకీకరణ దిశగా ప్రభావశీలంగా అడుగులు పడటం లేదన్నారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో తలపెట్టిన విపక్షాల సమావేశం ఏమైందని ప్రశ్నించారు. ఎవరు ఓడినా, ఎవరు గెలిచినా పర్వాలేదని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించకపోతే రాజ్యాంగ మనుగడే ప్రశ్నార్తకం అవుతుందన్నారు.


ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో వంచిత్ బహుజన్ అగాడి నాందేడ్ ఇంచార్జ్ ఫారుఖ్ అహ్మద్, దళిత, ఆదివాసీ సంఘాల నాయకులు దుర్గం శేఖర్, సందీప్ దాండ్గే, గోడం గణేష్, బోర్లకుంట దీపక్, రవి జబాడే, ప్రజ్ఞాకుమార్, సోగల సుదర్శన్, దుర్వ నగేష్, శోభాబాయి తుల్జాపురే, వర్షా కాంబ్లే తదితరులు పాల్గొన్నారు.