Tarnam Bridge Diversion Road in Adilabad | జైనథ్: తర్నం బ్రిడ్జ్ కృంగిపోవడంతో గత నాలుగైదు నెలల నుంచి ప్రజలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని తర్నం బ్రిడ్జ్ వద్ద తాత్కాలికంగా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే సోమవారం (అక్టోబర్ 14న) పరిశీలించారు. రోడ్డు నిర్మాణం సంబంధించిన పలు విషయాలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా BJP ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. తర్నం బ్రిడ్జి వద్ద రూ.4.5 కోట్లతో నిర్మిస్తున్న డైవర్షన్ రోడ్డు నిర్మాణ పనులు మరో రెండు నెలలు అయ్యే అవకాశం ఉందన్నారు. అయితే ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు తాత్కాలికంగా రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం ఉన్న బ్రిడ్జిను కూలగొట్టేసి అక్కడ కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారని తెలిపారు. అలాగే బోరాజ్ నుంచి మహారాష్ట్ర వరకు రోడ్డు నిర్మాణ పనులు జూన్, జూలై నెలలో పూర్తి చేయాలని ప్రణాళిక ప్రకారం పోతున్నామని అన్నారు. తాత్కాలికంగా తర్నం రోడ్డు పై నాలుగైదు రోజులో ప్రయాణాలు సాగించవచ్చన్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధులు ఖర్చు చేసి ప్రజల అసౌకర్యాన్ని దూరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట అధికారులు, బిజెపి నాయకులు తదితరులు ఉన్నారు.
భారీ వర్షాలకు కొట్టుకుపోయిన తర్నం బ్రిడ్జి
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని తర్నం బ్రిడ్జి భారీ వర్షాలతో కొట్టుకుపోయింది. అక్కడ అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో తర్నం బ్రిడ్జి నుంచి జైనథ్, బేల, మీదుగా రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు మహారాష్ట్ర వైపు వెళ్తున్న ప్రయాణికులకు దారి మూసుకుపోయినట్లు అయిందని తెలిసిందే. దీనిపై స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ కొన్ని రోజుల నుంచి శ్రమిస్తున్నారు.
ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్ తర్నం బ్రిడ్జి కోసం జాతీయ రహదారి అధికారులకు ప్రతిపాదనలు పంపారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం తర్నం బ్రిడ్జి సమీపంలో డైవర్షన్ రోడ్డు నిర్మాణానికి రూ.4.5 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కొన్ని రోజుల కిందట తెలిపారు. రెండు వారాల కిందట అధికారులు, ఇంజనీర్లతో కలిసి తర్ణం బ్రిడ్జి సమీప పరిసర ప్రాంతాలను బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరిశీలించారు.
త్వరలోనే కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం
తర్నం బ్రిడ్జి వద్ద పనులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ కొన్నిరోజుల కిందట పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా రోడ్డు నిర్మాణం పూర్తి చేసి రవాణా సౌకర్యాలు మెరుగు చేస్తామన్నారు. వీలైతే రాత్రి పగలు కష్టపడి పనులు పూర్తి చేయాలని సైతం అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. బ్రిడ్జి సమీపంలోని తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేపట్టాలని, ఆ తర్వాత డైవర్షన్ నిర్మాణం పనులను పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రస్తుతం లాండా సాంగ్వి, ఆడ, అర్లీ మీదుగా వాహనాలు వెళుతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాత్కాలికంగా డైవర్షన్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తే జైనథ్ మండలం వాసులకు రోడ్డు కష్టాలు తీరతాయని భావిస్తున్నారు. మరో ఆరు నెలల్లో వర్షాలకు కుంగిపోయిన బ్రిడ్జిని కూలగొట్టేసి కొత్త బ్రిడ్జ్ నిర్మాణం పనులు మొదలుపెడతారని పాయల్ శంకర్ చెప్పారు.
Also Read: Mogilaiah Land Issue: పద్మశ్రీ మొగులయ్యకి అండగా నిలిచిన రాచకొండ కమిషనర్, సమస్య పరిష్కరిస్తానని హామీ