Padma Shri Mogilaiah land issue | హైదరాబాద్: పద్మశ్రీ గ్రహీత కిన్నెర మొగులయ్యకి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు అండగా నిలిచారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన భూమిలో గోడలను గుర్తు తెలియని దుండగులు కూల్చివేయడంతో రాచకొండ కమిషనర్ ఎల్బీ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో మొగులయ్యని కలిసి సమస్య వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం మొగులయ్యకు ఇచ్చిన భూమి పరిరక్షణకు పూర్తి బాధ్యత తీసుకొంటామని రాచకొండ సీపీ సుధీర్ బాబు హామీ ఇచ్చారు. అనంతరం మొగులయ్యని కమిషనర్ సుధీర్ బాబు గౌరవ పూర్వకంగా సత్కరించారు.


పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ దర్శనం మొగులయ్యకి తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలోని హయత్ నగర్ మండలం, బాగ్ హయత్ నగర్ సర్వే నెం.159 లో 600 గజాల భూమిని మంజూరు చేసింది. మొగులయ్య తనకు ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్ కు చుట్టూ ఫ్రీ కాస్ట్ గోడ నిర్మించుకున్నారు. కానీ అక్టోబర్ 11వ తేదీన ఉదయం 08:00 గంటల సమయంలో మొగులయ్య తన ప్లాట్ వద్దకు వెళ్లి చూసేసరికి ఉత్తరం వైపు ఉన్న ఫ్రీ కాస్ట్  గోడను గుర్తుతెలియని వ్యక్తులు కూలగొట్టినట్లు గుర్తించి ఆశ్చర్యపోయారు. ఈ విషయంపై మొగులయ్య అదే తేదీ నాడు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మొగులయ్య ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.




Also Read: KTR News: ప్రొఫెసర్ సాయిబాబాకు నివాళులు అర్పించేందుకు వెళ్లిన కేటీఆర్‌కు చేదు అనుభవం


ఈ విషయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పద్మశ్రీ గ్రహీత మొగులయ్యని సోమవారం (అక్టోబర్ 14న) ఎల్ బి నగర్ లోని క్యాంపు కార్యాలయంలో పిలిపించి మాట్లాడారు. ఫ్రీ కాస్ట్ గోడ పునర్ నిర్మించుకొనుటకు తగిన తోడ్పాటు అందిస్తామని చెప్పి మొగులయ్యను అడిగి రాచకొండ సీపీ స్వయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మొగులయ్యకు ఇచ్చి ఆ భూమి పరిరక్షణకు పూర్తి బాధ్యత తీసుకొంటామన్నారు. ఈ కేసులో తదుపరి విచారణ చేసి నేరస్తులను పట్టుకొని చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ మనోహర్, హయత్ నగర్ సిఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


Also Read: Telangana News: దసరా పండుగకు ఆర్టీసీ టికెట్ చార్జీలు పెంచలేదు - ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన