Asifabad Tiger News | ఆసిఫాబాద్: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని అటవీ ప్రాంతాల్లో పులి సంచారం స్థానికులను కలవరపెడుతోంది. కేరామేరి మండలంలోని కెరమెరి ఘాట్, పరందోలి, కరంజివాడ, లక్మాపూర్, ఇందాపూర్ గ్రామాల శివారు అటవీ ప్రాంతాల్లో పులి సంచరించిన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మహారాష్ట్ర నుండి వాంకిడి మండలం మీదుగా కేరామేరి మండలంలోకి ఈ పులి సంచరించినట్లు అటవీ అధికారులు సైతం చెబుతున్నారు. పులి సంచరించిన విషయం తెలుసుకొని పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పంట పొలాల్లో సోయా, పత్తి పంటలను తీసేందుకు రైతులు బిక్కుబిక్కుమంటూ వనికి పోతున్నారు. ఎక్కడ నుంచి పులి వస్తుందోననీ భయాందోళనకు గురవుతున్నారు. 


రెండేళ్ల కిందట ఖానాపూర్ అటవీ ప్రాంతంలో


గత రెండేళ్ల కిందట వాంకిడి మండలంలోని ఖానాపూర్ అటవీ ప్రాంతంలో ఓ ఆదివాసి రైతు చేనులో పత్తి ఏరుతుండగా పులి పంజా విసిరింది. ఆపై అతడిని కొంత దూరం మేరకు లాక్కొని వెళ్లి హతమార్చింది. అనంతరం కాగజ్ నగర్ అటవీ ప్రాంతాలలో పులి సంచారం గత కొద్దిరోజులుగా అందరినీ హడలెత్తించింది. మళ్లీ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో పులి సంచారం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పులి సంచరించిన విషయం వాస్తవమేనని జోడేఘాట్ రేంజ్ అధికారి జ్ఞానేశ్వర్ ఏబీపీ దేశంతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ పులి మహారాష్ట్ర నుండి వాంకిడి మీదుగా కేరామేరి మండలంలోకి సంచరించిందని ప్రస్తుతానికైతే జోడేఘాట్ రేంజ్ పరిధిలో పులి సంచరిస్తున్నట్లు తెలిపారు. తమ అటవీశాఖ సిబ్బంది ట్రాక్టర్స్ సహయంతో పులి అడుగుజాడలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని, పులికి ఎలాంటి హాని కలగకుండా పంట పొలాల్లో అడవిపందులకు అమర్చిన విద్యుత్ తీగల కంచెలను తొలగిస్తున్నట్లు తెలిపారు. 


పులి సంచారంపై పరిసర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని, పంట పొలాల్లోకి వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు చీకటి పడక ముందే త్వరగా ఇళ్లలోకి వెళ్లాలని ఫార్టెస్ట్ అధికారులు సూచించారు. ఒంటరిగా వెళ్లవద్దని, కనీసం ఇద్దరు ముగ్గురు గుంపుగా ఉండాలని, కరెంటు తీగలను పొలాల్లో ఎవరైనా అమర్చితే వాటిని తొలగించాలని సూచించారు. ఎక్కడైనా పులి పాదముద్రలు లాంటివి కనిపిస్తే, పులి సంచారంపై అనుమానం వచ్చినా తమకు సమాచారం అందివ్వాలని ప్రజలను అప్రమత్తం చేశారు. 


Also Read: KTR News: ప్రొఫెసర్ సాయిబాబాకు నివాళులు అర్పించేందుకు వెళ్లిన కేటీఆర్‌కు చేదు అనుభవం