Telangana Lok Sabha Election 2024 Polling- ఆదిలాబాద్: తెలంగాణలో లోక్ సభ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 శాసనసభా నియోజక వర్గాలలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవిఎం) లను ఓట్ల లెక్కింపు కేంద్రమైన అదిలాబాద్ జిల్లాలోని మూడు కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లకు తరలించామని సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్, రిటర్నింగ్ అధికారి రాజర్షి షా అన్నారు. 


నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు అమరిక 
 ఆయా సెగ్మెంట్ల నుంచి తరలించిన ఈవీఎంలను జాగ్రత్తగా సరిచూసుకుని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకనుగుణంగా వాటిని స్ట్రాంగ్ రూమ్ లలో నియోజకవర్గాల వారీగా అమర్చడం జరిగిందన్నారు. మంగళవారం ఉదయం అభ్యర్థుల ఏజెంట్లు, ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్, రిటర్నింగ్ అధికారి రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లకు సీల్ వేశారు. మంగళవారం ఉదయం 4.00 గంటల ప్రాంతంలో పోలింగ్ అనంతరం రిసెప్షన్ సెంటర్ కు చేరుకున్న ఈవియం లను కట్టుదిట్టమైన భద్రత మధ్య స్థానిక టిటిడిసి హాల్ లో ఏర్పాటు చేసిన అదిలాబాద్, బోథ్ ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోని  స్ట్రాంగ్ రూమ్ లకు తరలించిన పిదప శాంతినగర్ లో ఏర్పాటు చేసిన EVM గోదాంను పరిశీలించారు. 




అనంతరం  అదిలాబాద్ లోని సంజయ్ పాలిటెక్నిక్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన నిర్మల్, ముదొల్, ఖానాపూర్, స్ట్రాంగ్ రూమ్ లలో, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన సిర్పూర్, ఆసిఫాబాద్ స్ట్రాంగ్ రూమ్ లలో  ఈవిఎం లను భద్రపరిచి, ఈవీఎంల భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, టిటిడిసిలో మూడు జిల్లాలకు సంబందించిన అధికారులు, రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో స్క్రూటినీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ లు అదిలాబాద్  శ్యామలా దేవి, ఆసిఫాబాద్ దీపక్ తివారి, DRO లోకేష్, మూడు జిల్లాల RDO లు వినోద్, రత్న కళ్యాణి, కోమల్ రెడ్డి, జీవాకర్ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.