Delhi Liquor Policy Case Kavitha News: న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని మే 20వ తేదీ వరకు పొడిగించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసులో రిమాండ్ ముగియడంతో కవితను వర్చువల్ గా ఆన్ లైన్‌లోనే రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవిత దర్యాప్తు కొనసాగుతోందని, రిమాండ్ పొడిగించాలని ఈడీ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. 8 వేల పేజీల సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసినట్లు ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. ఈడీ విజ్ఞప్తి మేరకు ఈనెల 20 వరకు ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 


ఇప్పటికే సీబీఐ కేసులో కోర్టు ఎమ్మెల్సీ కవితకు మే 20 వరకు కస్టడీ విధించడం తెలిసిందే. సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను పరిగణన లోకి తీసుకునే అంశంపై ఈ 20న కోర్టు విచారణ చేపట్టనుంది. తాజాగా ఈడీ కేసులో కోర్టు కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. 


కొనసాగుతున్న కవిత కస్టడీ.. 
వారం రోజుల కిందట కస్టడీ ముగియడంతో మే 7న రౌజ్‌ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టారు. తనను ఆన్ లైన్ లో విచారణకు హాజరుపరచవద్దని, నేరుగా కోర్టుకు తీసుకెళ్లాలని కవిత పిటిషన్ పై స్పందించిన కోర్టు అందుకు అంగీకరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన కవితకు మే 14వ తేదీ వరకు కస్టడీ పొడిగించింది న్యాయస్థానం. కోర్టు విధించిన కస్టడీ ముగియడంతో తిహార్ జైలు నుంచి ఆన్ లైన్ లో వర్చువల్ గా కవితను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈడీ విజ్ఞప్తి మేరకు మరో వారం రోజులపాటు కవిత కస్టడీ పొడిగించారు.


ఈడీ అధికారులు మార్చి 15న కవితను విచారణ చేపట్టి, అదే రోజు సాయంత్రం అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించారు. అప్పటినంచి తిహార్ జైల్లో ఎమ్మెల్సీ కవిత విచారణ ఖైదీగా ఉన్నారు. ఇదే కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల మధ్యంతర బెయిల్ మీద విడుదలయ్యారు. పలువురు ఆప్ నేతల్ని సైతం ఈడీ విచారిస్తోంది. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసును కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్నాయని తనకు బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేసుకోగా, కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.