CM KCR: తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌తో పాటు ఈ సారి ఎన్నికల్లో కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో కూడా గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి కేసీఆర్ పేరు ఉంది. కేసీఆర్ రెండు స్థానాల నుంచి పోటీ చేయనుండటం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. ఈ నెల 9వ తేదీన రెండు స్థానాలకు కేసీఆర్ నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారు అయింది. నామినేషన్ వేయడానికి ముందు దేవాలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేయనున్నారు.


అయితే కామారెడ్డిలో పోటీ చేస్తున్న కేసీఆర్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నామినేషన్లు వేసేందుకు 100 మంది రైతులు రెడీ అయ్యారు.  100 మంది పాల్ట్రీ రైతులు కేసీఆర్‌పై నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు.  పాల్ట్రీ ధరలను కార్పొరేట్ శక్తులు నిర్ణయిస్తున్నాయని, దీని వల్ల తమకు అన్యాయం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోడంతో దానికి నిరసనగా కేసీఆర్‌పై పోటీ చేయాలని రైతులు నిర్ణయించుకున్నారు.


ఇవాళ కామారెడ్డి జిల్లాలోని పద్మాశాలి సంఘ భవనంలో పాల్ట్రీ ఫార్మర్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో చికెన్ సెంటర్స్ అసోసియేషన్, ట్రేడర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్ట్రీ రైతులకు తమ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. తమ డిమాండ్ల సాధన కోసం కామారెడ్డిలో కేసీఆర్‌పై 100 మంది పాల్ట్రీ రైతులు నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తమ డిమాండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుండటంతో.. విడతల వారీగా 100 మంది పాల్ట్రీ రైతులు నామినేషన్లు వేస్తారని చెప్పారు. పాల్ట్రీ ధరలను రైతులే నిర్ణయించుకునేలా అవకాశం కల్పించాలని, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నట్లుగానే.. పాల్ట్రీ రంగానికి కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే సెంట్రల్ బోర్డు ద్వారా పాల్ట్రీ రంగానికి ఇచ్చే 50 శాతం సబ్సిడీని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.


అలాగే గ్రో ఇన్ ఛార్జెస్ ప్రభుత్వమే నిర్ణయించాలని, ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న మక్కలు పాల్ట్రీ రంగానికి 28 శాతం సబ్సిడీకి ఇవ్వాలని అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లపై ఒత్తిడి తెచ్చేందుకు నామినేషన్లు వేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఇంటిగ్రేటెడ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఓన్ ఫార్మర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకట్ రావు పాల్గొన్నారు.  ఒకేసారి 100 మంది నామినేషన్లు వేయనుండటంతో కామారెడ్డి నియోజకవర్గంపై రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి పడింది. ఎక్కువమంది నామినేషన్లు వేయడం వల్ల కేసీఆర్‌కు ఏమైనా నష్టం జరుగుతుందా? అనే చర్చ జరుగుతోంది. గతంలో లోక్‌సభ ఎన్నికల సమయంలో నిజామాబాద్‌లో కవితపై పసుపు రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. కవిత ఓటమి చెందటానికి ఇది కూడా ఒక కారణమైంది.