Nizamabad Road Accident : నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేల్పూరు ఎక్స్ రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు జగిత్యాల జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మంటల్లో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
మహబూబ్ నగర్ జిల్లాలో లగ్జరీ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు తృటిలో బయటపడ్డారు. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తోన్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో మొత్తం 16 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. బస్సు సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో ప్రయాణికులను అప్రమత్తం చేసి సకాలంలో వారిని దింపేయడంతో పెను ప్రమాదం తప్పింది. కర్నూలు నుంచి హైదరాబాద్ బయలుదేరిన లగ్జరీ బస్సు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం దివిటిపల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందకు దింపాడు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 16 మంది ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. బస్సు అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపే బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది.
కర్నాటకలో ఘోర ప్రమాదం
కర్నాటకలో ఆదివారంఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ ట్రక్కు కాలువలోకి దూసుకెళ్లినంది. కూలీలలో వెళ్తున్న ట్రక్కుకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన బెలగావిలో ఆదివారం చోటుచేసుకున్నది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మందికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. పోలీసులు సమచారం మేరకు గోకాక్ తాలూకలోని అక్కాతంగియార హలా గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు బెలగావికి ట్రక్కులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బెలగావిలోని కనబరగి గ్రామం వద్ద ట్రక్కు అదుపుతప్పి బళ్లారి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాహనంలో చిక్కుకుపోయిన వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బెలగావి పోలీస్ కమిషనర్ ఎంబీ బోర లింగయ్య ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలైనట్టు కర్నాటక పోలీసులు ప్రకటించారు.