గోదావరి నీళ్ల తరలింపునకు సాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను మంచిప్ప గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్యాకేజీ 21లో చేపట్టబోయే రిజర్వాయర్ నిర్మాణానికి భూములిచ్చేందుకు ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలు అభ్యంతరం చెబుతున్నారు. పుట్టి పెరిగిన ఊళ్లను వదిలి వెళ్లేందుకు ఇష్టపడట్లేదు. పట్టా భూములిస్తే ఉపాధి కోల్పోతామంటూ ఆందోళనకు దిగుతున్నారు. అధికారులు వారం క్రితం గ్రామసభ నిర్వహించి పరిహారం గురించి చెప్పినా వారు ఒప్పుకోలేదు. ప్రాజెక్టు ఉద్దేశం, నిర్వాసితులకు వర్తించే ప్రయోజనాలను వివరించారు. అయినప్పటికీ ముంపు బాధితులు మరోమారు నిరసనకు దిగి ప్రాజెక్టు పనులు అడ్డుకున్నారు. దీంతో రానున్న రోజుల్లో ఎలా ముందుకెళ్లాలనే విషయంలో అధికారులు ఆలోచనలో పడ్డారు.
జిల్లాలో 20,21,22 ప్యాకేజీ పనులు జరుగుతున్నాయి. 21వ ప్యాకేజీలో భాగంగా మంచిప్ప గ్రామ శివారులో పంపుహౌస్ నిర్మిస్తున్నారు. దీనికి అనుబంధంగా రిజర్వాయర్ ను నిర్మించి నీటిని ఇతర ప్రాంతాలకు తరలించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు 3.5 టీఎంసీ నిల్వ సామర్థ్యంతో నిర్మాణాన్ని ప్రతిపాదించారు. స్థానిక కొండెం, మంచిప్ప చెరువులు కలపనున్నారు. ఇంతటి సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మాణంతో వందలాది ఎకరాల పట్టా భూములతో పాటు తండావాసుల గృహాలు ముంపునకు గురవుతాయని డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే భూసేకరణ చేయాలని నిర్ణయించి ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనిపై సమాచారం అందటంతో తండావాసులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
మొదట కాంగ్రెస్ హాయాంలో 21 ప్రాజెక్టు 1.5 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మించాలని ప్రతిపాదించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చారు 1.5 నుంచి 3.5 టీఎంసీలకు సామర్థ్యాన్ని పెంచారు. ఈ రీడిజైన్ వల్ల 10 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములు, నివాసాలు కోల్పోతామని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి వైపు నీటిని తరలించేందుకు పంపుహౌస్ నిర్మాణం కోసం తవ్వకాలు ప్రారంభించారు. ఈ పనులను గ్రామస్థులు అడ్డగించారు. ఈ పనులకు ఆనుకొని భూములున్న వారు ఇప్పటికే కోర్టులో కేసు వేసి స్టే తెచ్చుకున్నారు. త్వరలోనే కోర్టులో వాదనలు జరగనున్నాయి. గతంలో భూసేకరణ జరిగిన సందర్భాల్లో నిర్వాసితులైన వారికి సరైన పరిహారం అందలేదని పలువురు ముంపు బాధితులు చెబుతున్నారు. కొందరేమో రీడిజైన్ చేసి ముంపు ప్రభావం లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
నిర్వాసితులమైతే పునరావాసంలో ఆలస్యమై అవస్థలు పడతామని వాదిస్తున్నారు. పరిహారంతో ఇళ్లయినా కట్టుకోగలమా, ఒక చోట ఉన్న వాళ్లందరం.. విడిపోయి మరోచోట జీవనం అంటే ఇబ్బందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే భూసేకరణకు అభ్యంతరం చెబుతున్నామని వివరిస్తున్నారు. ఇక్కడి బాధితులు మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాలకు వెళ్లి చూసొచ్చిన సందర్భం కూడా ఉంది. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు ఇప్పటికీ అవస్థలు పడుతున్నారని తమకు కూడా ఆ గతే పడుతుందన్న ఆందోళనలో ఉన్నారు మంచిప్ప రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలు. మంచిప్ప-కాల్పోల్ గ్రామం రోడ్డు తొలగించనున్నారు. ప్రత్యామ్నాయంగా ముదకపల్లి వైపు మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. వీరికి కొత్తగా అటవీ ప్రాంతం నుంచి రోడ్డు నిర్మిస్తారు. మంచిప్ప-చద్మల్, గాంధారి మార్గంతో పాటు బైరాపూర్ వెళ్లే రోడ్డు కూడా తొలగించనున్నారు. ఈ రెండు చోట్ల ప్రత్యామ్నాయ రహదారులు వేయరు. దీంతో గాంధారి, కామారెడ్డి వైపు వెళ్లే మార్గం పూర్తిగా క్లోజ్ అవుతుందని ఆందోళన చెందుతున్నారు.
మొదట చెప్పినట్లు 1.5 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మిస్తామని చెబితేనే తాము ఒప్పుకున్నామని... మళ్లీ 3.5 టీఎంసీలతో రిజర్వాయర్ సామర్థ్యం పెంచటం వల్ల తాము పూర్తిగా నష్టపోతున్నామని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. అసలు తమకు భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయ్. ఇక్కడ రిజర్వాయర్ నిర్మాణమే అవసరం లేదంటున్నారు మంచిప్ప గ్రామ ప్రజలు. ఇక్కడ రిజర్వాయర్ నిర్మించి నీటిని మరో ప్రాంతానికి తరలిస్తూ.. తమకు పూర్తిగా అన్యాయం చేస్తున్నారని వారంతా ఆవేదన చెందుతున్నారు. 1.5 టీఎంసీల నుంచి 3.5 టీఎంసీల సామర్థ్యం పెంచటం వల్ల కేవలం 1000 ఎకరాలకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. దీని కోసం రీ డిజైన్ అవసరమే లేదని అంటున్నారు ముంపు గ్రామాల ప్రజలు. భూముల విలువ కోట్లల్లో ఉంటే ప్రభుత్వం ఇచ్చే పరిహారం అంతంత మంత్రంగా ఉందంటున్నారు ముంపు గ్రామాల ప్రజలు. ఎట్టి పరిస్థితుల్లో రిజర్వాయర్ నిర్మాణం జరగనివ్వమని చెబుతున్నారు. పనులను అడ్డుకుని తీరుతామని హెచ్చరిస్తున్నారు.