Nizamabad News : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మోడ్రన్ ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థినుల పట్ల ఓ ఉపాధ్యాయుడు అసభ్యoగా ప్రవర్తించాడు. విద్యార్థినులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో పాఠశాలకు వచ్చి టీచర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు వెంకట రమణను తల్లిదండ్రులు చితకబాదారు. వెంకటరమణ మోడ్రన్ పబ్లిక్ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకుని టీచర్ ను అదుపులోకి తీసుకున్నారు.
"ఆ సార్ మాకు సైన్స్ చెబుతాడు. కారణంగా లేకుండా టచ్ చేస్తుంటాడు. నన్నే చూడండి అంటుంటాడు. చూసి నవ్వుతుంటాడు. ల్యాబ్ లో మార్కులు వేసేందుకు అభ్యంతకరంగా ప్రవర్తిస్తున్నాడు." - విద్యార్థిని
నెల్లూరులో స్కూల్ ముందు విద్యార్థిని తల్లి ధర్నా
నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్ లోని ఓ స్కూల్ లో ఓ అమ్మాయి తల్లి గొడవ చేసింది. స్కూల్ యాజమాన్యం తమకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేసింది. స్కూల్ తో తన పాప కాపీ కొట్టిందనే నెపంతో టీచర్, వ్యాన్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించారని, తన కుమార్తెకు న్యాయం చేయాలని ఆమె స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. కరస్పాండెంట్ కారు కదలనీయకుండా రోడ్డుపైనే కూర్చున్నారు. తన కూతురితో స్కూల్ లో టీచర్, వ్యాన్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇక స్కూల్ యాజమాన్యం వాదన మరోలా ఉంది. విద్యార్థిని పరీక్షల్లో స్లిప్ పెట్టిందని, ఆ విషయం తల్లికి కూడా తెలుసని, కావాలనే ఇప్పుడు రాద్ధాంతం చేస్తోందని స్కూల్ కరస్పాండెంట్ చెబుతున్నారు. విద్యార్థినికి క్రమశిక్షణ నేర్పడమే తప్పా అని కరస్పాండెంట్ ప్రశ్నిస్తున్నారు. తాము క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని అంటున్నారామె.
సోది క్లాస్ అంటూ ఇన్ స్టా పోస్ట్
విద్యా బుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలు విద్యార్థులతో అసభ్యకర మాటలు మాట్లాడుతూ బూతు పురాణం వల్లించారు. కామారెడ్డి జిల్లా మేనూర్ ఆదర్శ పాఠశాల ఇంటర్మీడియట్ విద్యార్థినులను గదిలో పెట్టి కట్టెలు విరిగిపోయేలా చితకబాదింది. విచక్షణా రహితంగా విద్యార్థినులను కొట్టిన తెలుగు టీచర్ మహేశ్వరిని సస్పెండ్ చేయాలంటూ పాఠశాల ముందు విద్యార్థులు నిరసన చేపట్టారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మేనూర్ ఆదర్శ పాఠశాలలోని ఇంటర్మీడియట్ విద్యార్థినులను తెలుగు టీచర్ మహేశ్వరి విచక్షణ రహితంగా కొట్టారు. దీంతో విద్యార్థులు తెలుగు టీచర్ ను సస్పెండ్ చేయాలంటూ పాఠశాల ముందు నిరసన చేశారు. తెలుగు టీచర్ మహేశ్వరి కొంతకాలంగా విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. కొంత మంది విద్యార్థులు ఆమె ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ లో సోది క్లాసు అంటూ పోస్ట్ చేశారు. టీచర్ కు ఈ విషయం తెలియడంతో విద్యార్థులను పిలిపించి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఎవరు అంటూ ప్రశ్నించారు. దీంతో పోస్ట్ చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు తప్పయిందంటూ మరొకసారి ఇలా చేయమంటూ క్షమాపణలు కోరారు.
కట్టెలు విరిగేలా కొట్టిన టీచర్
అయినా కోపంతో తెలుగు టీచర్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన విద్యార్థినులను పచ్చి కట్టెలు విరిగేలా విచక్షణా రహితంగా కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల వచ్చి సదరు ఉపాధ్యాయురాలతో వాగ్వివాదానికి దిగారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన మీరు ఇలా విద్యార్థుల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టడమెంటని ప్రశ్నించారు. బట్టలూడదీసి కొడతానంటూ టీచర్ అసభ్యకరంగా మాట్లాడడంతో విద్యార్థుల తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేశారు. టీచర్ తమను ఇష్టం వచ్చినట్టు కొట్టిందంటూ బాధిత విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులందరూ పాఠశాల ముందు కూర్చొని తెలుగు టీచర్ మహేశ్వరిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు.