Zika Virus in Pune:
జికా లక్షణాలు..
కొవిడ్, మంకీపాక్స్ వైరస్లతోనే సతమతం అవుతుంటే...ఇప్పుడు జికా వైరస్ కూడా భయ పెడుతోంది. పుణేలో జికా వైరస్ కేసు నమోదైంది. నవంబర్ 16న పుణేలోని జహంగీర్ హాస్పిటల్‌కు ఓ బాధితుడు అనారోగ్యంతో వచ్చాడు. దగ్గు, నీరసం, జ్వరంతో బాధ పడుతుండడంతో వైద్యులు అనుమానంతో టెస్ట్ చేయించారు. ఈ టెస్ట్‌లో జికా వైరస్ సోకినట్టు తేలింది. వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది పరిసరాల ప్రజలకు పలు సూచనలు చేశారు. పుణే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూడా ఆ ఏరియా అంతా వైరస్ కట్టడికి అవసరమైన చర్యలు చేపడుతోంది. బాధితుడి పరిసరాల్లోని ఇళ్లలోని వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. టెస్ట్‌లు నిర్వహించగా...వేరెవరికీ పాజిటివ్‌గా నిర్ధరణవలేదు. దోమలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ వైరస్ సోకి ఉంటుందని అధికారులు భావించినా...ఆ ప్రాంతంలో అలాంటి పరిస్థితులేమీ
లేవు. ఆ ప్రాంతమంతా శానిటైజ్ చేసి ప్రజలకు సూచనలు చేశారు. బాధితుడు నాసిక్ నుంచి ఇటీవలే పుణేకు వచ్చాడు. అంతకు ముందు అక్టోబర్‌లో సూరత్ వెళ్లొచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి బాధితుడికి ఎలాంటి లక్షణాలు లేవని, ఆరోగ్యంగానే ఉన్నట్టు వెల్లడించారు. ఈ మధ్యే మహారాష్ట్రలోని పాల్ ఘర్ జిల్లాకు చెందిన ఓ ఏడేళ్ల బాలికకు జికా వైరస్ పాజిటివ్ గా తేలినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని తలసరి గ్రామంలో ఉన్న గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో ఆమె చదువుకుంటోందని తెలిపారు. రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా జికా వైరస్ కేసు గతేడాది పుణెలో నమోదైందని.. రెండో కేస్ ఇదేనని వైద్య అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇలా సోకుతుంది..
జికా వైరస్ ఏడెస్ అనే దోమ నుంచి మనుషులకు ఈ వ్యాధి సోకుతుంది. ప్రాణాంతకం కాకపోయినప్పటికీ... ఇప్పటి వరకు దీనకి మందు కనిపెట్టలేకపోయారు శాస్త్రవేత్తలు. ఈ వైరస్ సోకడం వల్ల కొందరిలో జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలకు ఈ జికా వైరస్ సోకినట్లు అయితే వారి ఎదుగుదలపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గర్భిణులకు ఈ వైరస్ సోకితే పుట్టబోయే శిశువు మెదడు సరిగా అభివృద్ధి చెందకుండా ఉండే అవకాశం ఉంటుంది. 1947 ప్రాంతంలో ఈ వైరస్ అడువల్లో ఉండే కోతుల్లో కనిపించింది. ఆ తర్వాత అంటే 1952లో మనుషుల్లోనూ గుర్తించారు. 2017లో తమిళనాడు, అహ్మదబాద్ లలో ఈ కేసులు నమోదైనట్లు తేలింది. దోమ వల్ల జికా వైరస్ సోకుతున్నందును.. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో, ఇంటి బయట దోమలు నిల్వకుండా తరచుగా పరిసరాలను శుభ్రం చేసుకోవాలని వివరిస్తున్నారు. ఏదైనా జ్వరం, దద్దుర్లు వంటివి వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఏం కాదులే అని ఇంట్లోనే ఉంటే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. దోమలను దరి చేరనీయకుండా మీరు తీసుకునే జాగ్రత్తలే మీకు జికా వైరస్ సోకకుండా చేస్తుందని చెబుతున్నారు.