AP Highcourt News :   ఆంధ్రప్రదేశ్ పోలీసులు నారా లోకేష్, జర్నలిస్ట్ అంకబాబుపై పెట్టిన  వెర్వేరు కేసులను ఏపీ హైకోర్టు కొట్టి వేసింది.  కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని సూర్యారావుపేటలో  పోలీస్ స్టేషన్‌లో నారా లోకేష్ పై పోలీసులు కేసు పెట్టారు.  టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చన్నాయుడు   ను పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ సీటీ కోర్టులో హాజరుపరచినప్పుడు పరామర్శకు వెళ్లిన లోకేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. లోకేష్‌ తరపున సీనియర్ లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. వాదనలను విన్న హైకోర్టు కేసు కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది.


మరో వైపు సీనియర్ జర్నలిస్ట్ అంకబాబుపై సీఐడీ పెట్టిన కేసునుకూడా ఏపీ హైకోర్టు కొట్టి వేసింది. మూడు నెలల కిందట గన్నవరం ఎయిర్‌పోర్టులో   ఎయిర్ పోర్ట్ లో ఒక మ‌హిళ వ‌ద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆ ఘటనపై ఓ వార్తాపత్రికలో వచ్చిన న్యూస్ ఐటమ్‌ను వాట్సాప్ లో ఇతరులకు షేర్ చేశారన్న కారణంగా   సీనియ‌ర్ జ‌ర్నలిస్ట్  అంకబాబుపై సీఐడీ కేసు న‌మోదు చేసి రాత్రికి రాత్రి అరెస్ట్ చేసింది.   అంకబాబుపై 120బి, 153, 550 ఐపీసీ సెక్షన్ల కింద కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేశారు.  వయసు రీత్యా వృద్ధుడైన  అంకబాబుకు నోటీసు ఇవ్వకపోగా.. 24 గంటలపాటు అదుపులో ఉంచుకుని విచారించి కోర్టులో హాజరుపరిచారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో నిందితులకు 41ఏ నోటీసు జారీచేయాలి. అంకబాబుపై నమోదైన కేసులోని 153ఏ, 505 (2) రెడ్‌ విత్‌ 120బీ సెక్షన్లు ఏడేళ్లలోపు శిక్ష పడేవే. 


కానీ ఆయనకు 41ఏ నోటీసు ఇవ్వకుండా సీఐడీ అధికారులు గురువారం రాత్రి విజయవాడలో ఆయన ఇంటికి వెళ్లి అరెస్టు చేసి.. నేరుగా గుంటూరులోని తమ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. అప్పటి నుంచి రకరకాల కోణాల్లో విచారణ జరిపి.. ఆయన వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.  గుంటూరు సీఐడీ కోర్టు మేజిస్ట్రేట్‌ సెలవులో ఉండడంతో ఆ కోర్టు ఇన్‌చార్జిగా ఉన్న ఐదో అదనపు మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ జి.స్పందన విచారణ జరిపారు. అంకబాబుపై నమోదుచేసిన సెక్షన్లు ఏడేళ్లలోపు శిక్ష పడేవి కావడంతో.. ఆయనకు 41ఏ నోటీసు ఇవ్వకుండా ఎందుకు కోర్టుకు తీసుకొచ్చారని ఆమె ప్రశ్నించారు. వెంటనే నోటీసిచ్చి పంపాలని ఆదేశించారు. ఆయన్ను రిమాండ్‌కు పంపేందుకు తిరస్కరించారు. బేషరతుగా విడుదల చేయాలన్నారు. దీంతో సీఐడీ అధికారులు ఆయన్ను విడుదల చేశారు.


ఈ కేసు విషయంలో సీఐడీ అధికారుల తీరుపై మేజిస్ట్రేట్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తాము నోటీసిచ్చినా ఆయన తిరస్కరించారని.. అందుకే కోర్టుకు తీసుకొచ్చామని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. దీనిపై మేజిస్ట్రేట్‌ విస్మయం వ్యక్తం చేశారు. అంకబాబు నోటీసు తిరస్కరణ, ఆయన్ను కోర్టులో హాజరుపరిచిన వ్యవహారంపై 4 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై సీఐడీ పోలీసులు కోర్టుకు వివరణ ఇచ్చారు.  ఆ తర్వాత ఆయన తనపై అక్రమంగా కేసు పెట్టారని .. కేసును కొట్టి వేయాలని హైకోర్టులో పిటిషన్దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు తప్పుడు కేసుగా నిర్దారించి కేసును కొట్టి వేసింది.